Vizag Steel Plant : కూటమి ‘ఉక్కు’ పట్టు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:16 AM
స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని కేంద్రం నాలుగేళ్ల క్రితం ప్రకటించడంతో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది.

మాట నిలుపుకొన్న ప్రభుత్వ నేతలు
కార్మికోద్యమానికి తొలినుంచీ బాసట
దీక్ష చేసిన పల్లా.. గంటా రాజీనామాతో ఊపు
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని కేంద్రం నాలుగేళ్ల క్రితం ప్రకటించడంతో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. కార్మిక సంఘాలన్నీ ఏకమై పోరాట కమిటీగా ఏర్పడ్డాయి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు చేశాయి. ఇప్పటికీ స్టీల్ ప్లాంటు గేటు వద్ద దీక్షా శిబిరాలు నడుస్తున్నాయి. కార్మిక సంఘాల నేతలు అటు ఢిల్లీలోను, ఇటు రాష్ట్రంలోను అన్ని పార్టీల నాయకులను కలిసి సాయం చేయాలని అప్పట్లో కోరారు. అయితే, నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా విశాఖ ఉక్కు సమస్యను కేంద్రం వద్ద ప్రస్తావించలేదు. సాయం కోరలేదు. ఎన్నికల ముందు కూటమి నాయకులు పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్, పవన్‌కల్యాణ్, తదితరులు స్టీల్‌ప్లాంటు ప్రాంతానికి వెళ్లి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి, అండగా ఉంటామని హామీఇచ్చారు. అంతకుముందు విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు విశాఖ ఉక్కు సమస్యను ఢిల్లీ పెద్దలకు తెలియజేసి భారీగా ఆర్థిక సాయాన్ని కోరారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని విశాఖపట్నం రప్పించారు. ఇక్కడి సమస్యలు చూపించారు. ఇలా కూటమి నేతలు అంతా స్టీల్‌ప్లాంటు కార్మికులకు అండగా నిలబడి, ఇచ్చిన హామీని నెరవేర్చారు. తొలుత రెండు దఫాలుగా రూ.1,650 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజీ కింద రూ.11,440 కోట్ల సాయం అందేలా చేశారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: చంద్రబాబు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం రూ.11,440 కోట్లు కేటాయించడంపై ప్రధాని మోదీకి, ఎన్డీయే ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామని చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కోసం ఆర్థిక మంత్రి, ఉక్కుశాఖ మంత్రితో ఎన్నోసార్లు చర్చించానని చెప్పారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒకప్పటి నినాదం. ఇప్పుడు విశాఖ ఉక్కు మనందరి సెంటిమెంట్. స్టీల్‌ప్లాంట్‌కు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా టీడీపీ ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకొంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకొనేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడు నెలల్లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.