Share News

Tadepalli : జగన్‌ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదు!

ABN , Publish Date - Feb 11 , 2025 | 06:57 AM

సీసీ కెమెరాలు పని చేయట్లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు లేఖ రాసింది.

 Tadepalli : జగన్‌ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదు!

  • తాడేపల్లి ఎస్‌హెచ్‌వోకు వైసీపీ లేఖ

గుంటూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్‌ నివాసం వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిజంగానే సీసీ కెమెరాలు పని చేయడం లేదా.. లేక ఆయన ఇంటి వద్ద ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటన కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వకుండా చేసేందుకు కావాలనే ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల ఘటన దర్యాప్తునకు సీసీ టీవీ ఫుటేజ్‌ ఇవ్వమని పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కోరారు. అయితే ఆ పార్టీ ఫుటేజ్‌ అందించకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనం ఇచ్చింది. దీంతో వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి పేరుతో తాజాగా తాడేపల్లి ఎస్‌హెచ్‌వోకు లేఖ రాసింది. జగన్‌ ఇంటి వద్ద ఈ నెల 5న జరిగిన ఘటనకు సంబంధించి తాము 6న ఫిర్యాదు చేశామని, 7న నోటీసులు పంపారని లేఖలో పేర్కొన్నారు. ఇంతకు ముందు అనేకసార్లు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చి పార్టీ కార్యాలయం ముందు నానా బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు. అయితే ‘ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం వాటికి కనెక్షన్‌ తొలగించింది. పునరుద్ధరించమని పలుమార్లు కోరినా స్పందించలేదు. కెమెరాలు పని చేయకపోవడం వల్ల వాటిల్లో ఏమీ రికార్డు కాలేదు’ అని తెలిపింది.

Updated Date - Feb 11 , 2025 | 06:57 AM