Share News

TDP : వచ్చారు.. అరిచారు.. వెళ్లారు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:42 AM

మాజీ సీఎం జగన్‌ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్‌ ప్రసంగం ఆలకించలేదు.

TDP : వచ్చారు.. అరిచారు.. వెళ్లారు..

  • బడ్జెట్‌ తొలిరోజు సభలో వైసీపీ వింతధోరణి

  • జగన్‌ సహా 11మంది ఎమ్మెల్యేలు హాజరు

  • ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు

  • జగన్‌ సైగలతో పోడియం ముందుకు...

  • గవర్నర్‌ ప్రసంగం మొదలైన తొమ్మిదో నిమిషమే సభ నుంచి వాకౌట్‌

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్‌ ప్రసంగం ఆలకించలేదు. గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే సభకు వచ్చారా అన్నట్టు.. గవర్నర్‌ తన ప్రసంగం మొదలుపెట్టిన తొమ్మిదో నిమిషమే వారంతా వాకౌట్‌ చేశారు. గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ రావడానికి రెండు నిమిషాల ముందు జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి వచ్చారు. గవర్నర్‌ 10.01 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం ప్రారంభంలో నారా చంద్రబాబునాయుడు అని పలకాల్సి ఉండగా, నరేంద్ర చంద్రబాబునాయుడు అని పొరపాటున ఆయన పలికారు. దీనిపై వైసీపీ సభ్యులు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ లేకపోతే గెలిచేవారు కాదంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్‌ సైగ చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోడియం ముందుకు ప్లకార్డులతో దూసుకెళ్లారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జగన్‌ తప్ప మిగిలిన సభ్యులందరూ పోడియం ముందుకెళ్లి....‘ప్రతిపక్షాన్ని గుర్తించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ నినాదాలిచ్చారు. టీడీపీ సభ్యులు కూడా..గుర్తింపు కోసం అడుక్కోవద్దంటూ ప్రతిగా నినాదాలు చేశారు. 10.09 నిమిషాలకు జగన్‌ మళ్లీ సైగ చేయడంతో అక్కడ నుంచి అందరూ వాకౌట్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కండువా వేసుకుని రాగా, జగన్‌ మాత్రం కండువా లేకుండా కనిపించారు. సీనియర్‌ వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేతికర్ర ఆసరాతో పోడియం వద్దకు వచ్చి నిలబడ్డారు. 10.01 గంటలకు ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌.. 38 పేజీల బడ్జెట్‌ పుస్తకాన్ని చదవడం 11.08 గంటలకు ముగించారు.

Updated Date - Feb 25 , 2025 | 04:42 AM