Share News

YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:45 PM

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. గుంటూరు జిల్లా కాజ గ్రామం నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుటుపల్లి వరకు జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
AP PCC Chief YS Sharmila

విజయవాడ, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా నగర ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి ఆయన పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి ఆయన పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కోరుతున్నామన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఆమె కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సోమవారం లేఖ రాశారు.

వంగవీటి మోహన్ రంగా ప్రజలకు చేసిన సేవలు అనిర్వచనీయమని వైఎస్ షర్మిల అభివర్ణించారు. సామాజిక న్యాయంపై దృష్టి సారించి.. అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన వాదించారని ఆమె పేర్కొన్నారు. భూమి లేని వారికి భూ పంపిణీ చేసి.. ప్రజల గుండెల్లో రంగా చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.

ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి "వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారిగా పేరు పెట్టాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలంటూ సీఎం చంద్రబాబును రాసిన లేఖలో ఆమెను కోరారు.

Also Read: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?


గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి గన్నవరం సమీపంలోని చిన్న అవుటుపల్లి వరకు..ఈ జాతీయ రహదారిని నిర్మించారన్నారు. సుమారు 47.8 కిలోమీటర్ల మేర దూరమున్న ఈ విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారి పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ఆరు వరుసల జాతీయ రహదారి కారణంగా విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు కొంత మేర గట్టెక్కుతాయని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన తర్వాత..అటు గుంటూరు నుంచి విజయవాడ వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడుతోంది. అదీకాక కోల్‌కతా, చెన్నై జాతీయ రహదారి కూడా కావడంతో.. భారీ వాహనాలు సైతం విజయవాడ మహానగరం మీదగా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి


అలాంటి వేళ.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలోని కాజా నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుటుపల్లి వరకు ఆరు లైన్లతో జాతీయ రహదారిని నిర్మించారు. దీని వల్ల విజయవాడ మహానగరంలో ట్రాఫిక్ సమస్య దాదాపుగా కనుమరుగుకానుంది. ఇక ఈ జాతీయ రహదారి మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అలాంటి సమయంలో.. ఈ రహదారికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:45 PM