YS Sharmila: మా అన్నకు అంత దమ్ము లేదు.. షర్మిల షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:37 PM
YS Sharmila: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అదికూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

అమరావతి, ఫిబ్రవరి19: అసెంబ్లీకి వెళ్లకుండా.. జైల్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా సోదరుడు వైఎస్ జగన్‌పై ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదని మండిపడ్డారు. కానీ నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం మాత్రం వైఎస్ జగన్‌కు ఉందంటూ ఆమె వ్యంగ్యంగా అన్నారు.
ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు ఆయనకు మాత్రం మొహం చెల్లదన్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ.. అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్‌కి లేదని ఎద్దేవా చేశారు.11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత వాళ్లకు అసలే లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
అయితే శాసన సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆమె హితవు పలికారు. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వెంటనే రాజీనామాలు చేయాలంటూ వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు.. సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. ఈ పథకాల అమలు ఎప్పుడని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారంటూ ఎద్దేవా చేశారు.
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై, సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ సీఎం చంద్రబాబును తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ నెల 28 వ తేదీన ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి.. తద్వారా ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హతవు పలికారు.
Also Read: ఏదో తేడాగా ఉంది
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ ద్వారా కోరారు. సభలో సభ్యుల బలం లేకుంటే ప్రతిపక్ష హోదా కేటాయించలేమంటూ వైఎస్ జగన్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ వైఎస్ జగన్ .. ఏపీ అసెంబ్లీని ఆశ్రయించారు.
దీంతో ఈ వ్యవహారం ఇప్పడప్పుడే తేలదన్న విషయం సుస్పష్టం. మరోవైపు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పలువురు కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరంతా గెలిచినా.. అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటూ ఓ విధమైన ఆవేదనతో ఉన్నట్లు ఓ చర్చ అయితే జరుగుతోంది. ఆ క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరు పట్ల ఒకింత ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ వ్యవహారంలో కీలక సాక్షిగా ఉన్న సత్యవర్థన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే అతడితోపాటు అతడి కుటుంబ సభ్యులను సైతం భయపెట్టి.. ఈ కేసును విత్ డ్రా చేయించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సత్యవర్థన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఆ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి.. విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు. దీంతో అతడిని వైఎస్ జగన్ మంగళవారం జైలుకు వెళ్లి పరామర్శించారు. అందులోభాగంగా జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కీలక వాఖ్యాలు చేశారు. దాంతో వైఎస్ జగన్‌పై అధికార పక్షం నిప్పులు చెరిగింది. అలాంటి వేళ.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం స్పందించారు.
For AndhraPradesh News And Telugu News