YSRCP : ఓఎన్‌జీసీకి ‘బూడిద’!
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:10 AM
కడప జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి నకిలీ బెరైటీస్ విక్రయిస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు.
బెరైటీస్ పేరుతో డోలమైట్, బొగ్గు, మట్టి, రోడ్ మెటల్ మిశ్రమం
బూడిద రంగేసి విక్రయం.. కడప వైసీపీ సిండికేట్ అక్రమాలు
సహకరిస్తున్న ఓఎన్‌జీసీ ఇంటిదొంగలు.. నాణ్యత పరిశీలనకు తాయిలాలు
కోడూరులోనే సెటిల్‌మెంట్, సొమ్ములు.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?
ఇది నయా దోపిడీ! ముగ్గురాయి(బెరైటీస్) పౌడర్ బూడిద రంగులో ఉందా? ఆ వాసన వస్తోందా? అయితే చాలు!! ఆ పేరిట మట్టిని, రోడ్‌మెటల్ పౌడర్‌ను, బూడిదరంగును కలగలిపి బెరైటీస్ గా నమ్మించి సొమ్ము చేసుకోవచ్చు. 45 కేజీల బెరైటీస్ సంచిలో 30 కేజీలు ఈ నకిలీ మిశ్రమం, మిగిలిన 15 కేజీలు సీగ్రేడ్ ముగ్గురాయి కలిపి దీనిని ‘బీగ్రేడ్’ బెరైటీస్ గా విక్రయించేస్తున్నారు. ఓఎన్‌జీసీకి పంపించి కళ్లుచెదిరే లాభాలు కూడగట్టుకుంటున్నారు. వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి సొమ్ములు కుమ్మేస్తున్న వైనం ఇదే!!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కడప జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి నకిలీ బెరైటీస్ విక్రయిస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)కు దీనిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా మూడో కంటికి తెలియకుండా ఈ దందాను నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. ఇక, ఈ ముఠాతో చేతులు కలిపిన ఓఎన్‌జీసీలోని కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఇంటి దొంగలు నకిలీ ముగ్గురాయికి పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో వైసీపీ సిండికేట్ ముఠా అక్రమ, అవినీతి వ్యాపారం మూడు పువ్వులు-ఆరు కాయలు అన్న చందంగా సాగిపోతోంది. మట్టి, రోడ్ మెటల్ పౌడర్, బూడిదరంగును కలగలిపి బెరైటీ్‌సగా నమ్మిస్తున్న కడప జిల్లా కీలక వైసీపీ నేత, ఆయన సిండికేట్.. కళ్లుచెదిరే లాభాలు గడిస్తున్నారు. బెరైటీస్ బెనిఫిసియేషన్ ప్లాంట్లలో భారీగా వ్యర్ధాలు ఉంటాయి. ప్రతి నెలా ఇవి టన్నుల కొద్దీ మిగిలిపోతాయి.
కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత తనుకున్న తెలివితేటలతో బెనిఫిసియేషన్ ప్లాంట్లలో మిగిలిపోతున్న టన్నుల కొద్ది వ్యర్ధాలు, డోలమైట్ పౌడర్, బూడిదరంగు మిశ్రమం, ఇంకా కొంత నాసిరకం బొగ్గును సేకరించి క్రషింగ్ చేసి పౌడర్‌గా మారుస్తున్నారు. దాన్నే సీగ్రేడ్ బెరైటీస్ బ్యాగుల్లో కలుపుతున్నారు. 45 కేజీల సామర్ధ్యం ఉండే బ్యాగులో 30కేజీలమేర ఈ కల్తీ మిశ్రమ పౌడర్, మిగిలిన 15కేజీలు సీ గ్రేడ్ ముగ్గురాయి పౌడర్‌ను కలుపుతున్నారు. ఇలా మిక్స్ చేసిన బ్యాగులనే సీగ్రేడ్ బెరైటీ్‌సగా ఓఎన్‌జీసీకి సరఫరాచేస్తున్నారని తెలిసింది.
ఇంటి దొంగల తీరు ఇంతింతై..
ఓఎన్‌జీసీకి పంపించే బెరైటీ్‌సకు నాణ్యతా పరీక్ష ఉంటుంది. అయితే.. ఇక్కడ కూడా సిండికేట్ ముఠా నయవంచన చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రతి 250 టన్నుల లోడ్‌కు సంబంధించి ఓఎన్‌జీసీ నాణ్యతా విభాగం సదరు బ్యాగులను పరిశీలన చేయాలి. వాటిలోని పౌడర్ నాణ్యతను పరీక్షించాలి. అయితే, వైసీపీ నేత నకిలీ సరుకును కాకుండా.. పరీక్షలకోసం నాణ్యమైన సీగ్రేడ్ పౌడర్‌ను అందిస్తున్నారు. దీంతో నాణ్యతా పరీక్షల్లో ఎలాంటి తేడా కనిపించడం లేదు. అనంతరం.. వీటి మాటున కల్తీ ముగ్గురాయి సూపర్ సక్సెస్ అయిపోతోంది. దీనికి సంబంధించిన సెటిల్‌మెంట్ మొత్తం కోడూరులోనే జరుగుతున్నట్టు తెలిసింది. ఇక.. ఈ వ్యవహారమంతా కేంద్ర సంస్థలోని ఇంటిదొంగలకు తెలిసే జరుగుతుండడం విశేషం. సీగ్రేడ్ ట్రాన్సిట్‌లతో వచ్చే ముగ్గురాయిని బీగ్రేడ్‌గా నమోదు చేయడంలోనే వారి ’అవినీతి పనితీరు’ ఉండడం గమనార్హం. ఇక, కల్తీ మిశ్రమం బెరైటీ్‌సలో కలపడాన్ని వారు ఏమాత్రం కనిపెట్టే అవకాశమే లేదు. అంటే, అన్ని స్థాయిల్లో కేంద్ర సంస్థ అయిన ఓఎన్‌జీసీ ఇంటిదొంగల సహకారంతో కడప వైసీపీ నేత నేతృత్వంలోని సిండికేట్ నయవంచన చేస్తోంది.
పొంచిఉన్న ప్రమాదం
నిజానికి ఇలాంటి కల్తీ మిశ్రమాలను తయారు చేయడమే పర్యావరణానికి హానికరం. అలాంటిది, దాన్ని బెరైటీస్‌లో కలిపి ఆయిల్ డ్రిల్లింగ్ బావుల్లో లక్షల టన్నులు వినియోగించడం మరీ ప్రమాదరకం. పర్యావరణాన్ని ఫణంగా పెట్టడమే అవుతుంది. అంతేకాదు, ఏదైనా ప్రమాదాలు జరిగితే ఊహకందని నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. మంటలను అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది.