Share News

YSRCP : ఫీజు పోరు మార్చి 12కు వాయిదా

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:53 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు...

 YSRCP : ఫీజు పోరు మార్చి 12కు వాయిదా

నేతలు వద్దన్నా నాడు హడావుడిగా జగన్‌ ప్రకటన

ఇప్పుడు ఆఖరి నిమిషంలో కోడ్‌ సాకుతో వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ బుధవారం తలపెట్టిన ఫీజు పోరు చివరి నిమిషంలో వాయిదాపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు అసహనం వ్యక్తంచేసినా వారి అధినేత జగన్‌ వినిపించుకోలేదు. శాసనమండలి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని చెప్పినా ధర్నాలు చేయాల్సిందేనన్నారు. చివరకు జనస్పందన ఉండదని తేలిపోవడం.. పార్టీ శ్రేణులు అయిష్టత చూపడంతో ఆ కోడ్‌నే సాకుగా చూపి ధర్నాలను వాయిదావేశారు. సహజంగా ఆందోళన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తీసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా తాము ఫీజు పోరు చేపడతామని ఎన్నికల కమిషన్‌ను కోరితే.. అక్కడినుంచి ఎలాంటి స్పందనా రానందున.. మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పడం గమనార్హం. కాగా, కుమార్తె డిగ్రీ పట్టా పురస్కార కార్యక్రమం కోసం లండన్‌ వెళ్లి గత శుక్రవారం బెంగళూరుకు తిరిగొచ్చిన జగన్‌ దంపతులు.. సోమవారం రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌ చేరుకున్నారు. మంగళవారం మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, జోగి రమేశ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ హయాంలో పాలన పడకేసిందని ఆరోపించారు. తన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందని. సంక్షేమ పథకాలు ఠంచనుగా చెప్పిన తేదీ నాటికి అమలు చేశామని చెప్పారు. రాజధాని అమరావతిపై యథావిధిగా విషం చిమ్మారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కూటమి ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించేసిందని, దీనిపైనా పోరాటం చేద్దామని పిలుపిచ్చారు. వచ్చేనెల 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రాల్లో అట్టహాసంగా నిర్వహించాలని ముఖ్య నేతలను జగన్‌ ఆదేశించారు.


విజయసాయిరెడ్డి ప్రస్తావన రాలేదా?

కొద్దిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ప్రస్తావన సమావేశంలో రాలేదంటూ నేతలంతా ఒకే మాట చెప్పడం సందేహాలకు తావిస్తోంది. ‘అబ్బే.. సమావేశంలో 40 మంది ఉన్నప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? బహుశా సజ్జల రామకృష్ణారెడ్డితో దానిపై మాట్లాడారేమో’ అని కూడబలుక్కున్నట్లుగా వారు మీడియాకు చెప్పారు. కాగా, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తాడేపల్లిలో జగన్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు కూడా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 04:54 AM