UPI New Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ ఫోన్ నెంబర్లలో UPI సర్వీసెస్ బంద్..
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:29 PM
UPI New Rules: ఏప్రిల్ 1, 2025 నుంచి వీరి ఫోన్లలో యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. NPCI నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవారు నుంచి Google Pay, PhonePe, Paytm ఇలా యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయలేరు. ఎందుకంటే,

UPI New Rules: ఈ రోజుల్లో చిన్న మొత్తాలకు ఆన్‌లైన్ చెల్లింపు చాలా సాధారణ విషయంగా మారింది. వెంట క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల జీవితాలను సులభతరం చేశాయి డిజిటల్ పేమెంట్స్. దేశంలో చాలా మంది ఇప్పుడు UPI ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. కానీ, దీంతో పాటు సైబర్ నేరాల కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజల ఫోన్ల నుంచి ఏదొక మార్గంలో సొమ్ము కాజేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1, 2025 నుండి కొత్త నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఈ మొబైల్ నెంబర్లలో యూపీఐ సేవలు నిలిపివేస్తోంది. అయితే, యూజర్లు వెంటనే ఈ పనిచేస్తే డిజిటల్ పేమెంట్స్ ఆగిపోవు.
యూపీఐ కొత్త రూల్స్ ఏంటి..
ఏప్రిల్ 1 నుంచి గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) ఇలా ఏ యాప్‌ల ద్వారా ఈ యూజర్లు డిజిటల్ చెల్లింపులు చేయలేరు. కొత్త నిబంధనల ప్రకారం UPI సర్వీసెస్ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నెంబర్ బ్యాంక్ ఖాతాతో తప్పక లింక్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు యాక్టివ్‌గా లేకపోతే అలాంటి నెంబర్లు వెంటనే తొలగించాలని బ్యాంకులు, UPI ఆధారిత యాప్‌లను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశించింది. ఒకవేళ మీ బ్యాంకు అకౌంట్‌కు వాడుకలో లేని మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నట్లయితే యూపీఐ ఏప్రిల్ 1, 2025 నుంచి సేవలు ఆగిపోవచ్చు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది. పనిచేయని మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలతో లింక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సాంకేతిక లోపాలను వాడుకుని యూజర్లను దోపిడి చేస్తున్నారని వెల్లడించింది. టెలికాం ప్రొవైడర్లు గతంలో వినియోగదారులు వాడిన నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినప్పుడు సైబర్ మోసానికి గురయ్యే ఆస్కారం ఉంది. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదీగాక, UPI లావాదేవీలను సులభతరం చేయడానికి మీ బ్యాంక్ ఖాతాకు యాక్టివ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. చెల్లింపుల సమయంలో ఈ నంబర్ కీలకమైన ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. మనం ఎవరికి చెల్లింపులు చేస్తున్నామో నిర్ధారిస్తుంది. అదే ఇన్ యాక్టివ్‌లో ఉన్న నెంబర్ మరొక వ్యక్తికి కేటాయిస్తే చెల్లింపుల్లో వైఫల్యాలు తలెత్తవచ్చు. లేదా సైబర్ నేరగాళ్లు మన చెల్లింపులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు.
మీరు ఏమి చేయాలి?
మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకపోయినా లేదా చాలాకాలంగా రీఛార్జ్ చేయకపోయినా ముందుగా ఆ నంబర్ ఇప్పటికీ మీ పేరుతో యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకోండి. మీ టెలికాం ప్రొవైడర్ (జియో, ఎయిర్‌టెల్, విఐ, లేదా బిఎస్‌ఎన్‌ఎల్ వంటివి)ను కలిసి తనిఖీ చేసుకోండి. యాక్టివ్‌గా ఉంటే సరి. లేకపోతే వెంటనే రీ-యాక్టివేట్ చేయండి. మీ పేరుతో లేకపోతే వెంటనే కొత్త మొబైల్ నెంబర్‌ని మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోండి.
Read Also : టెక్ నైపుణ్యాలకు అడ్డా భారత్
Gold and Silver Prices: పసిడి ప్రియులకు షాక్..
జీనోమ్ వ్యాలీలో సీజీటీ కేంద్రం