Business : రతన్ టాటా 'మోడల్' రద్దు చేసి.. టాటా గ్రూప్.. కొత్త రోడ్ మ్యాప్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:09 PM
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ ఏళ్ల నాటి సంప్రదాయంలో పెను మార్పు తెచ్చింది. రతన్ టాటా మరణానంతరం అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇకపై రతన్ టాటా 'మోడల్'పై కంపెనీ పనిచేయదు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొత్త రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. దీని ప్రకారం..

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ ఏళ్ల నాటి సంప్రదాయంలో పెను మార్పు తెచ్చింది. రతన్ టాటా మరణానంతరం అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇకపై రతన్ టాటా 'మోడల్'పై కంపెనీ పనిచేయదు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వ్యాపార నమూనాకు భిన్నంగా ఇప్పుడు తన వ్యాపార పద్ధతుల్లో పెనుమార్పు తీసుకురాబోతోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొత్త రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. దీని ప్రకారం టాటా గ్రూప్ కింద ఉన్న కంపెనీలు తమ అప్పులు, బాధ్యతలను స్వయంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, టాటా సన్స్ గ్రూప్స్, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎయిర్ ఇండియా వంటి కొత్త కంపెనీలను స్వతంత్రంగా నిర్వహించుకోవాలని టాటా గ్రూప్ కోరింది. బ్యాంకులకు ఇప్పటికే కంఫర్ట్ లేట్, క్రాస్-డిఫాల్ట్ క్లాజులను అందించే పద్ధతిని నిలిపివేయాలని సమాచారం ఇచ్చింది.
టాటా గ్రూప్ నిర్ణయం
కొత్త రోడ్ మ్యాప్ నిర్ణయాన్ని బ్యాంకులకు తెలియజేయడంతో.. టాటా గ్రూప్‌కు లెటర్ ఆఫ్ కంఫర్ట్, క్రాస్ డిఫాల్ట్ క్లాజ్‌ల జారీని బ్యాంకులు నిలిపివేశాయి. కంపెనీ కొత్త వెంచర్లకు భవిష్యత్ మూలధన కేటాయింపులు, ఈక్విటీ పెట్టుబడి అంతర్గత వనరుల ద్వారా జరుగుతాయని టాటాసన్స్ బ్యాంకులకు తెలిపింది. అంటే కంపెనీలోని ఒక్కో కేటగిరీలో ఉన్న ప్రముఖ లిస్టెడ్ కంపెనీ మాత్రమే హోల్డింగ్ ఎంటిటీగా వ్యవహరిస్తుందని టాటాసన్స్ బ్యాంకులకు స్పష్టం చేసింది.
20వేల కోట్ల రుణం చెల్లించారు
టాటా సన్స్ గతేడాది స్వచ్ఛందంగా ఆర్‌బీఐకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించింది. అన్‌లిస్టెడ్‌గా ఉండటానికి కంపెనీ రూ. 20 వేల కోట్లకు పైగా రుణాన్ని చెల్లించింది. కొత్త వ్యాపారానికి ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నుంచి నిధులు అందుతాయని విశ్వసిస్తున్నారు. ఈ మార్పు తర్వాత భవిష్యత్తులో గ్రూప్‌లోని కంపెనీలకు నిధులు ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)నుంచి వచ్చే డివిడెండ్ ద్వారా అందనున్నాయి.
టాటాసన్స్‌పై ప్రభావం
ఈ నిర్ణయం టాటాసన్స్‌పై పెద్దగా ప్రభావం చూపదని ఆర్థిక విశ్లేషకుల అంచనా. ఎందుకంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్స్యూమర్ వంటి లిస్టెడ్ కంపెనీలు తమ క్యాపిటల్ స్వంతంగానే నిర్వహిస్తున్నాయి. అయితే, టాటా సన్స్ గణనీయమైన వాటాను కలిగి ఉన్న హోల్డింగ్ కంపెనీలను ఈ చర్య ప్రభావితం చేయవచ్చు. టాటా గ్రూప్ పెద్ద వాటాదారుగా ఉన్నందున బ్యాంకులు ఈ కంపెనీలకు స్పష్టమైన హామీ లేకుండా రుణాలు అందజేస్తాయి. గ్రూప్ కింద ఉన్న ప్రముఖ అనుబంధ సంస్థలు అంతర్గత ఈక్విటీ వనరులపై దృష్టి సారిస్తే భవిష్యత్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించవచ్చనే లక్ష్యంతో టాటా గ్రూప్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.