Mahashivaratri: వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు..
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:07 PM
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

నంద్యాల, ఫిబ్రవరి 19: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీస్వామివారి యగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో శ్రీనివాసరావు దంపతులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది. రేపటి (గురువారం) నుంచి శ్రీ స్వామి అమ్మవారికి వివిధ వాహనసేవలు, శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈరోజు నుంచి మార్చి 1 వరకు అంటే 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖులకు నాలుగు విడతలుగా బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు అదనపు క్యూలైన్లు, తాత్కాలిక వసతి, పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
మిర్చి యార్డ్‌లో వైఎస్సార్‌సీపీ మూకల వీరంగం..
మరోవైపు శ్రీశైలం స్వామి వారిని దర్శించుకునే పలువురు భక్తులు కాలినడకన వస్తారు. ఐదు రోజుల ముందు నుంచే వీరు పాదయాత్రతో శ్రీశైలంకు వస్తారు. కాలినడక వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర చేస్తూ వచ్చే భక్తులు బస చేసేందుకు కైలాశద్వారం, భీమునికొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో షెడ్లను నిర్మించారు. వారి దాహార్తిని తీర్చేందుకు మంచి నీటి ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే...
19న యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం ధ్వజారోహణ
20వ తేదీన భృంగివాహన సేవ
21వ తేదీన హంసవాహనసేవ
22వ తేదీన మయూరవాహనసేవ
23వ తేదీన రావణవాహన సేవ
24వ తేదీన పుష్పపల్లకీ సేవ
25వ తేదీన గజవాహనసేవ
26 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ
అదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. 27న రథోత్సవం తెప్పోత్సవం, 28న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ మార్చి 1న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News and Telugu News