Vasantha panchami : వసంత పంచమి.. ఇలా చేయండి చాలు
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:46 PM
Vasantha panchami : వసంతం పంచమని శ్రీపంచమని అని కూడా అంటారు. ఈ రోజు చిన్న పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది. అందుకోసం సరస్వతి దేవి కొలువు తీరిన బాసర, వర్గల్ దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వస్తారు.

ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. మాఘ మాసం. ఇంకా చెప్పాలంటే ఇది శుభాల మాసం. వసంత పంచమి నుంచి శివరాత్రి వరకు దాదాపుగా అన్ని పర్వదినాలే. వసంత ఋతువు ఆరంభంలో వసంత పంచమి వస్తుంది. దీనిని శ్రీపంచమి అని కూడా అంటారు. ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ఆరాధిస్తే.. అత్యంత శ్రేష్టమని శాస్త్ర పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం సరస్వతీ దేవి జన్మించిన రోజు.. వసంత పంచమిని జరుపుకొంటారని అంటారు.
ఇంతకీ ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు..?
ఫిబ్రవరి 2వ తేదీ అంటే.. ఆదివారం మధ్యాహ్నం 12 :28 నిమిషాలకు మాఘ శుద్ధ పంచమి తిథి మొదలవుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 10 :13 నిమిషాల వరకు ఈ తిథి ఉంది. సూర్యోదయాన్ని బట్టి.. తిథిని అనుసరించి పండుగలు జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీని వసంత పంచమి జరుపుకోవాలని పంచాంగకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఆ రోజు ఉ.5.00 గంటల నుంచి ఉ.10.00 గంటల వరకు సరస్వతి దేవి పూజకు శుభ సమయమని వారు పేర్కొంటున్నారు.
వసంత పంచమి.. విశిష్టత
సరస్వతీ దేవి ఆశీస్సులు ఉంటే సకల కళలతోపాటు విద్య, జ్జానం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఈ రోజు సరస్వతీ దేవిని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.
శ్రీపంచమి రోజు.. ఇలా చేయండి చాలు.
సరస్వతీ దేవి అనుగ్రహం లభించాలంటే ఇలా చేయాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు. సరస్వతీ దేవిని ఆరాధించే సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా పెన్సిళ్లు పూజా మందిరంలో ఉంచి పూజించాలి. అదే విధంగా ఈ రోజు కళలకు ఉపయోగించే వస్తువులను సైతం పూజించాలి. ముఖ్యంగా సంగీత వాయిద్యాలను ఈ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన ఆయా కళలలో నిష్ణాతులు అవుతారని నమ్మతారు.
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
అలాగే వసంత పంచమి రోజు దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో సరస్వతి దేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు.. సరస్వతి దేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయాలి. అంటే.. 'సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి' ప్రార్ధన శ్లోకంతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలతో అర్చించాలి. ఇక ఈ రోజు.. చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధ గ్రహ దోషాలతో ఇబ్బందులు పడే వారు.. సరస్వతికి పూజలు నిర్వహించడం వల్ల ఆయా గ్రహాల ప్రతి కూల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.
వసంత పంచమి రోజు సరస్వతీ దేవి ఆరాధన చేసే వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మద్యం, మాంసాహారానికి ఈ రోజు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే సకల విద్యలు, సకల కళలు సొంతమవుతాయి. పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాలను సొంతం చేసుకుంటారు.
ఈ రోజు అత్యంత పవిత్రమైనది కావడంతో.. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం ప్రారంభిస్తే.. ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్ముతారు. అందుకే ఈ రోజు చిన్న పిల్లలకు సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలోని సరస్వతి దేవి దేవాలయంతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్‌లోని సరస్వతి దేవాలయంలో చిన్న పిల్లలతో అక్షరాభాస్యం చేయించేందుకు భక్తులు పోటెత్తుతారన్న సంగతి అందరికి తెలిసిందే.
For Devotional News And Telugu News