Share News

Women Health : ఇండియాలో ప్రతి 5 మందిలో ముగ్గురికి చిన్నప్పటి నుంచే ఈ సమస్య.. ఎందుకిలా.. పరిష్కారమేంటి..

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:26 PM

Women Health : పురుషులతో పోలిస్తే మహిళలను ఎక్కువగా రక్తహీనత సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇండియాలో 57 శాతం మహిళలు ఈ సమస్యతో పోరాడుతున్నారంటేనే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు రక్తహీనత సమస్య ఎందుకొస్తుంది.. వస్తే కలిగే నష్టాలేంటి.. రాకుండా ఎలా నివారించాలి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Women Health : ఇండియాలో ప్రతి 5 మందిలో ముగ్గురికి చిన్నప్పటి నుంచే ఈ సమస్య.. ఎందుకిలా.. పరిష్కారమేంటి..
Anemia Problem in Women

Women Health : దేశంలో ప్రతి 5 మంది మహిళల్లో 3 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తేడాల అనేక రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతోందనే సంగతి తెలిసిందే. పిల్లలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఏకైక సమస్య మాత్రం రక్తహీనత. అనీమియా బాధిత మహిళ శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావు. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల మొత్తం శారీరక క్రియలు ఆగిపోతాయి. మానసిక ఆరోగ్యమూ పూర్తిగా అదుపు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడకపోతే మహిళల ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడం అసాధ్యమే అవుతుందని సూచిస్తున్నారు.


రక్తహీనతతో బాధపడేవారికి అలసట, బలహీనత, తలతిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి పరిష్కరించుకోకపోతే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఐరన్, విటమిన్ బి-12 లేదా ఫోలేట్ లోపం మహిళల్లో కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను రప్పిస్తుంది. జన్యుపరమైన రుగ్మతల కారణంగా కూడా రక్తహీనతతో బాధపడే ఛాన్స్ ఉన్నా అది తక్కువమందిలోనే. రక్తహీనతతో బాధపడే మహిళల్లో సంతానోత్పత్తి కూడా కష్టమవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో టీనేజర్లలో సగానికిపైనే ఈ సమస్యతో బాధపడుతున్నారు.


సాధారణంగా మహిళలు బలహీనత, అలసట వంటి లక్షణాలున్నా పెద్దగా పట్టించుకోరు. వాస్తవానికి రక్తహీనత సమస్యకు ఇవే ప్రారంభ సంకేతాలు. ఈ కారణంగానే నిర్ధారించుకునే అవకాశం కోల్పోయి సకాలంలో చికిత్స పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మందిని ఐరన్ లోపం వేధిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోకపోవడం వల్ల విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్పడుతుంది. తద్వారా ఇది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది.


రక్తహీనతకు కారణాలు..

ఆహారపు అలవాట్లలో లోపాలే కాదు. అనేక ఇతర పరిస్థితులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. ఎక్కువగా జంగ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం, రోజంతా తరచుగా టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరం ఐరన్ గ్రహించలేదు. ఈ అలవాట్లు రక్తహీనత సమస్యను తెచ్చిపెడతాయి. ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం అయ్యే స్త్రీలలో హిమోగ్లోబిన్ లోపం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రెగ్నెసీ సమయంలో ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోని వారిలో రక్తహీనత వచ్చి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై కూడా పడుతుంది.


రక్తహీనత లక్షణాలు..

నిరంతర అలసట, బలహీనత, తరచుగా తలనొప్పి, తలతిరుగుడు, చర్మం పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, తరచుగా గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి మీ శరీరం రక్తహీనతతో బాధపడుతుందనడానికి సంకేతాలు. చేతులు, కాళ్ళు తరచుగా చల్లగా ఉండే మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


నివారణ మార్గాలు..

  • రక్తహీనతను నివారించడానికి సరైన ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. దీని కోసం ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.

  • ఆకుకూరలు (పాలకూర, ఆవాలు), బీట్‌రూట్, దానిమ్మ, ఆపిల్, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తినండి.

  • పప్పుధాన్యాలు, సోయాబీన్, మొలకెత్తిన ధాన్యాలు ప్రోటీన్లకు మంచి వనరులు.

  • విటమిన్ సి (నిమ్మ, నారింజ, ఆమ్లా) ఉన్న ఆహారాలను కూడా తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలి. శరీరం ఇనుమును బాగా గ్రహించడానికి ఇవి సహాయపడతాయి.

  • రక్తహీనతతో బాధపడేవారు వైద్యుడి సలహా మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి.

  • గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు ఐరన్ మాత్రలు తీసుకోవాలి.

  • ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేయించుకుంటూ మీ హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండండి.


Read Also : Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..

Raw Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..

Ice cream: ఐస్‌క్రీం తిన్న తర్వాత ఇవి తింటే.. ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే..

Updated Date - Mar 21 , 2025 | 05:28 PM