Share News

Nijjar Murder Case : నిజ్జర్ హత్య కేసులో.. 4 గురు భారతీయులకు బెయిల్..

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:03 PM

కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు భారతీయులుకు కెనడా కోర్టు బెయిలు మంజూరు చేసింది.

Nijjar Murder Case : నిజ్జర్ హత్య కేసులో.. 4 గురు భారతీయులకు బెయిల్..
Canadian Court Granted Bail to 4 Indians in Nijjar Murder Case

కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ ఉదంతం భారత్, కెనడాల మధ్య చిచ్చు రగిల్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ గత ఏడాది మేలో నలుగురు భారతీయుల పౌరులను అరెస్టు చేశారు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత కొంతకాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయమై మిత్రదేశాలు సున్నితంగా హెచ్చరించినా ఎవరికీ తలొగ్గలేదు కెనడా ప్రధాని ట్రూడో. తాజాగా ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నట్టు ట్రూడో ప్రకటించిన తరుణంలో.. నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన నలుగురు భారతీయులకు ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్న వీరికి ప్రాథమిక విచారణల అనంతరం బెయిలు మంజూరు చేసింది కెనడాలోని దిగువ కోర్టు.


జూన్ 2023 బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌. ఈ కేసులో ఫస్ట్‌ డిగ్రీ అభియోగాలు మోపుతూ కరణ్‌ బ్రార్‌, కమల్‌ ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ ప్రీత్‌ సింగ్‌, అమర్‌దీప్‌ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రవాస భారతీయులైన వీరిలో అమర్‌దీప్‌ బ్రాంప్టన్‌‌లో నివసిస్తుండగా.. మిగిలిన ముగ్గురూ ఎడ్మంటర్‌‌ ప్రాంతంలో నివసించేవారు. నిజ్జర్ హత్య కేసులో కుట్రకు పాల్పడ్డారనే కారణంతో గత కొన్ని నెలలుగా జైలులో మగ్గుతున్న వీరికి కెనడా కోర్టు బెయిలు మంజూరు చేసింది. అనంతరం కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదలాయిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.


నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం ఇరుదేశాల మధ్య వివాదానికి తెరలేపింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. నిందితులుగా భారత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రకటించడం.. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చడం వంటి అంశాల కారణంగా భారత్-కెనడాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. కెనడా నుంచి మన దౌత్యవేత్తను వెనక్కి రప్పించడమే గాక ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్‌నూ బహిష్కరించింది భారత్. అందుకు ప్రతిగా కెనడా కూడా ఒట్టావా నుంచి భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jan 09 , 2025 | 04:03 PM