International : 120 కమాండోలు.. 21 జెట్‌లు..3 గంటల్లోనే మిస్సైల్ ప్లాంట్ ధ్వంసం..
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:41 PM
సిరియాలోని క్షిపణి తయారీ కేంద్రాన్ని120 దళాలతోనే ఎలా ధ్వంసం చేశారో వివరాలు బయటపెట్టింది..ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF).2024 సెప్టెంబర్ 8న "ఆపరేషన్ మెనీ వేస్" పేరిట కేవలం 3 గంటల్లోనే..
సిరియాలోని క్షిపణి తయారీ కేంద్రాన్ని120 దళాలతోనే ఎలా ధ్వంసం చేశారో వివరాలు బయటపెట్టింది..ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF).2024 సెప్టెంబర్ 8న "ఆపరేషన్ మెనీ వేస్" పేరిట భూగర్భంలో నిర్వహించిన ఈ మిషన్‌ను కేవలం 3 గంటల్లోనే ఎటువంటి గాయాలు లేకుండా ఇజ్రాయెల్ దళాలు పూర్తిచేశాయని అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ నిధులతో నిర్మించిన ఈ క్షిపణి కేంద్రాన్ని వ్యూహాత్మకంగా ఎలా దాడి చేసి ఆపరేషన్ పూర్తిచేసింది అధికారిక నివేదికలో వెల్లడించారు. పశ్చిమ సిరియాలోని మస్యాఫ్ ప్రాంతానికి సమీపంలో "డీప్ లేయర్" అని పిలువబడే ప్రదేశం సిరియన్ వైమానిక రక్షణకు పెట్టని కోటగా పరిగణిస్తారు. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ తయారయ్యే క్షిపణులు లెబనాన్‌లోని హిజ్బుల్లాకు, అసద్ పాలనలోకి సిరియాకు సరఫరా అవుతున్నాయని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) ప్రకారం, 2017 చివరిలో దక్షిణ సిరియా జమ్రాయాలోని సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (CERS)లో ఇరాన్ డీప్ లేయర్ ప్రాజెక్టు నిర్మించడం ప్రారంభించింది. భూగర్భ రాకెట్ ఇంజిన్ తయారీ సైట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత ఇది మొదలైందని చెబుతోంది. భవిష్యత్తులో వైమానిక దాడులను, క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాలను కాపాడుకునే లక్ష్యంతో ఇది నిర్మించినట్లు చెబుతోంది. 2021 నాటికి 70 నుంచి 130 మీటర్ల పర్వతంలోకి భూగర్భంలో గుర్రపు డెక్క ఆకారంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఏళ్ల తరబడి పరిశీలించాక దాడి చేయాలని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణా దళం) నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 2023లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇరాన్ వరకూ పాకింది. పోరాటం ఉద్రిక్త దశకు చేరుకోవడంతో 2 నెలల శిక్షణ తర్వాత 100 మంది షల్డాగ్ కమాండోలు, 669 మంది వైద్యులతో కూడిన 20 యూనిట్లు "యాసూర్" అని పిలిచే నాలుగు CH-53 హెవీ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్‌లో బయల్దేరారు. AH-64 హెలికాప్టర్‌లు, 21 ఫైటర్ జెట్‌లు, ఐదు డ్రోన్‌లు, 14 నిఘా విమానాలు ఇజ్రాయెల్ నుంచి మధ్యధరా మీదుగా సిరియన్ గగనతలానికి చేరుకున్నాయి.
క్షిపణి కేంద్రం వైపు వెళ్తున్న దళాలు తప్పించుకునేందుకు ఐఏఎఫ్ సిరియా దళాల దృష్టిని మళ్లించేలా ఎత్తుగడ వేసింది. తర్వాత నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సుమారు 660 పౌండ్ల పేలుడు పదార్థాలను క్షిపణి కేంద్రం చుట్టుపట్ల పాతిపెట్టారు ఇజ్రాయెల్ సైనికులు. తర్వాత ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించాక రిమోట్‌తో పేల్చివేయగా ఒక మినీ భూకంపమే సంభవించినట్లుగా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చెల్లాచెదురైంది.
ధ్వంసం చేసిన క్షిపణి తయారీ కేంద్ర ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 100 నుంచి 300 క్షిపణుల మధ్య ఉంటుంది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకోగలవని ఐడీఎఫ్ అంచనా. 'డీప్ లేయర్' ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుకు కేవలం 200 కి.మీ, సిరియా పశ్చిమ తీరప్రాంతం నుంచి 45 కి.మీ దూరంలో ఉంది. ఇరాన్, ఇరాక్ ఆయుధాల కాన్వాయ్‌లు ఇజ్రాయెల్ దాడులు తప్పించుకునేలా భూగర్భ మార్గం సౌకర్యం కల్పించింది. దీని ద్వారా సిరియా సరిహద్దు నుంచి నేరుగా హిజ్బుల్లా క్షిపణులు పొందేందుకు వీలు కలుగుతుందని ఇజ్రాయెల్ వెల్లడించింది.