Share News

OPT Program: అమెరికాలో ‘ఓపీటీ’ మంటలు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:19 AM

అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రాంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమంపై మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) నేటివిస్టులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

OPT Program: అమెరికాలో ‘ఓపీటీ’ మంటలు!

  • ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోంది

  • హెచ్‌-1బీ వీసాకు సాధనంగా మారింది

  • స్థానిక యువత ఉద్యోగాలకు దూరం

  • ‘మాగా’ నేటివిస్టుల ఆరోపణలు

  • ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్‌

  • భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు

వాషింగ్టన్‌, జనవరి 1: అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రాంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమంపై మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) నేటివిస్టులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఎక్కువగా పడనుంది. అధికారంలోకి వస్తే హెచ్‌-1బీ వీసాల జారీ విధానాన్ని సంస్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాగా నేటివిస్టులు ఓపీటీపై దృష్టి సారించారు. ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు సాధారణంగా వారి మొదటి విద్యా సంవత్సరం తర్వాత ఓపీటీలో పాల్గొనవచ్చు. స్టెమ్‌ (ఎస్‌టీఈఎం) గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. తొలుత స్వల్పకాలిక వర్క్‌ పర్మిట్‌ కోసం ఉద్దేశించిన ఈ ఓపీటీ ఇప్పుడు పూర్తిగా దుర్వినియోగమవుతోందని, అమెరికాలో ఉద్యోగంతో పాటు హెచ్‌-1బీ వీసా పొందడానికి ఒక సాధనంగా మారిపోయిందని మాగా నేటివిస్టులు ఆరోపిస్తున్నారు. పని అనుభవం కోసం ఓపీటీలో చేరడానికి చాలామంది విదేశీ విద్యార్థులు ప్రత్యేకించి భారత్‌ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికాలో చదవడానికి వస్తుంటారు.


ఈ ప్రోగ్రాం వ్యవధి ముగిసేలోగా హెచ్‌-1బీ వీసాలకు మారడం ద్వారా అమెరికాలో తొమ్మిదేళ్ల వరకూ నివసించే అవకాశం పొందుతారు. వీరిలో కొందరు గ్రీన్‌ కార్డులు పొంది చివరకు అమెరికా పౌరులుగా మారుతున్నారు. కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం 2023 కేలండర్‌ సంవత్సరంలో అమెరికాలో 14,90,000 మంది ఎఫ్‌-1, ఎం-1 వీసాలు కలిగిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో 3,44,686 (23ు మంది) ఓపీటీద్వారా పనిచేయడానికి అనుమతి పొందారు. ఈ కారణంగా అమెరికన్‌ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని మాగా నేటివిస్టులు మండిపడుతున్నారు. అయితే ఓపీటీని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్‌ తర్వాత విదేశీ విద్యార్థులు పని అనుభవం పొందకుండానే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 02 , 2025 | 05:19 AM