Share News

Trump: సుంకాల తగ్గింపునకు భారత్‌ ఒప్పుకొంది

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:23 AM

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. వారు ఇంతవరకు చేసినదాన్ని ఇప్పుడు ఎవరో ఒకరు బయటపెడుతున్నందున పన్నులు తగ్గింపునకు అంగీకరించారని వ్యాఖ్యానించారు.

Trump: సుంకాల తగ్గింపునకు  భారత్‌ ఒప్పుకొంది

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

  • ఎలాంటి వ్యాఖ్య చేయని విదేశీ వ్యవహారాల శాఖ

వాషింగ్టన్‌, మార్చి 7: అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. వారు ఇంతవరకు చేసినదాన్ని ఇప్పుడు ఎవరో ఒకరు బయటపెడుతున్నందున పన్నులు తగ్గింపునకు అంగీకరించారని వ్యాఖ్యానించారు. అయితే భారత విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. ట్రంప్‌ ప్రకటన మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న కొద్ది నెలల్లో వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా భారత్‌ మార్కెట్‌లో ప్రవేశించనుంది. టెస్లా వాహనాలపై భారత్‌ ప్రస్తుతం 110ు దిగుమతి సుంకం విధిస్తోంది. మరోవైపు, కెనడా వస్తువులు అమెరికాకు అవసరం లేదని ట్రంప్‌ చెప్పారు. కెనడా నుంచి కలపను దిగుమతి చేసుకోబోమని, అమెరికా అడవుల్లోని కలపను ఉపయోగించుకుంటామని తెలిపారు. అమెరికా పాల ఉత్పత్తులపై కెనడా 220 శాతం సుంకం విధిస్తుండడాన్ని తప్పుపట్టారు. రష్యాపైనా బ్యాంకింగ్‌ ఆంక్షలు, సుంకాలు విధిస్తామని ట్రంప్‌ చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపి, కాల్పులు విరమించే వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు. అణు ఒప్పందంపై ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీకి లేఖ రాసినట్టు తెలిపారు.


చిన్న కత్తి చాలు.. గొడ్డలెందుకు

‘ఆపరేషన్లు చేసే చిన్న కత్తి చాలు.. చిన్న గొడ్డలి ఎందుకు?’ అంటూ తన సలహాదారు ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ సూచించారు. డోజ్‌ సారఽథిగా మస్క్‌... ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను, వ్యయాన్ని భారీగా తగ్గిస్తుండడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. డోజ్‌ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసిస్తూనే.. ప్రభుత్వ విభాగాలకు కార్యదర్శులే తప్ప మస్క్‌ అధిపతి కాదని స్పష్టం చేశారు. సిబ్బందిని తగ్గించాలని ఆయన సిఫార్సు చేసినా, పూర్తిగా అమలు చేయాల్సిన పనిలేదని కూడా తెలిపారు.

Updated Date - Mar 08 , 2025 | 05:23 AM