Share News

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:23 AM

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దులో జర్నలిస్ట్‌ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

అప్పుడే యుద్ధం ఆగిపోతుంది

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు

త్వరలో భారత్‌కు పుతిన్‌

రష్యా విదేశాంగ మంత్రి ధ్రువీకరణ

కీవ్‌, మాస్కో, సియోల్‌, మార్చి 27: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ త్వరలోనే చనిపోతాడని, అప్పుడు తమ ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగుతుందని అన్నారు. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందని, దీన్ని ఆపేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పుతిన్‌ ఆరోగ్యంపై నిరంతరం వదంతులు వస్తున్న నేపథ్యంలో బుధవారం పారి్‌సలో యూరోపియన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలో మందుపాతర పేలిన ఘటనలో రష్యా ప్రభుత్వ టీవీ జర్నలిస్ట్‌ అనా ప్రొకోఫీవా (35) మృతి చెందారు. ఆమె కెమెరామన్‌ దిమిత్రి వోల్కోవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉక్రెయిన్‌ సరిహద్దున ఉన్న రష్యాలోని బోల్గోరోడ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. మరోవైపు.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మద్దతు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే సైనిక సాయం అందించిన ఆ దేశం తాజాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 3వేల మంది అదనపు దళాలను రష్యాకు పంపించిందని దక్షిణ కొరియా సైన్యం గురువారం వెల్లడించింది. అలాగే మరిన్ని క్షిపణులు, ఆర్టిలరీ గన్‌లు, మందుగుండు సామగ్రిని కూడా పంపుతోందని, యుద్ధ పరిస్థితిని బట్టి ఆయుధ సరఫరాను మరింత పెంచవచ్చని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు.

Updated Date - Mar 28 , 2025 | 04:27 AM