Share News

CM Stalin: కేంద్రం బెదిరించినా ద్విభాషే మా విధానం

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:22 PM

కేంద్రప్రభుత్వం పదివేల కోట్లిచ్చినా రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

CM Stalin: కేంద్రం బెదిరించినా ద్విభాషే మా విధానం

- హిందీని అనుమతిస్తే మాతృభాషకు మరణమే

- అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ పునరుద్ఘాటన

చెన్నై: జాతీయ విద్యావిధానం పేరుతో రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) తేల్చిచెప్పారు. శాసనసభలో మంగళవారం ద్విభాషా విద్యావిధానంపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినా, నిధులివ్వకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిభాషా విద్యా విధానాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టంచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: IPS: పది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ


కేంద్రం త్రిభాషా విద్యావిధానం పేరుతో రాష్ట్రంలో హిందీ నిర్బంధంగా అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నిస్తోందని, హిందీని తృతీయ భాషగా అనుమతిస్తే మాతృభాష తమిళం మృతభాషగా మారిపోతుందన్నారు. సావధాన తీర్మానంపై బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఒకే మాటగా ఒకే బాటగా ద్విభాషా విద్యావిధానానికి గట్టి మద్దతిస్తూ ప్రసంగించడం హర్షదాయకమన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఉపనేత ఆర్‌బీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి త్రిభాషా విద్యావిధానాన్ని అంగీకరించాలని ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చినట్లు తెలిసిందని చెప్పారని, ఆ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం ఘాటైన సమాధానమే ఇచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితులలో త్రిభాషా విద్యావిధానాన్ని అనుమతించబోమని కేంద్రానికి స్పష్టపరచినట్లు ఆయన చెప్పారు.


ఢిల్లీ నేతలకు ఈపీఎస్‌ వివరించాలి...

ప్రధానప్రతిపక్షం ఉపనేత ఆర్‌బీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ ద్విభాషా విద్యావిధానానికి తామెల్లప్పుడూ గట్టి మద్దతునిస్తామని భరోసా ఇచ్చారని గుర్తు చేసిన సీఎం.. ఢిల్లీ వెళ్లిన ఆ పార్టీ అధినేత ఈపీఎస్‌ ఎవరితో భేటీ అయినా రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానానికి తావులేదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కేంద్రప్రభుత్వం రెండువేల కోట్లు కాదు..


పదివేల కోట్లిచ్చినా రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిధుల కంటే మాతృభాషను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని, ఇది ఆర్థిక సమస్య కానేకాదని, ఓ (తమిళ) జాతికి సంబంధించిన ప్రధాన సమస్య అని ఆయన చెప్పారు. 1968 జనవరి 23న ఈ అసెంబ్లీలోనే మాజీముఖ్యమంత్రి అన్నాదురై ద్విభాషా విద్యావిధానంపై స్పష్టమైన తీర్మానం ప్రతిపాదించారని,


ఆ మహానాయకుడి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్రంలో నిర్బంధ హిందీకి తావులేదని తేల్చిచెప్పారని, ఆ దిశగానే తాను కూడా త్రిభాషా విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్టాలిన్‌ శపథం చేశారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడం, ద్విభాషా విద్యావిధానాన్నే అమలు చేయడం, మాతృభాషను కాపాడుకోవడం, తమిళసంస్కృతీ సంప్రదాయాలను దేశవిదేశాలకు వ్యాపింపచేయడమే తమ ప్రధాన ఆశయాలని స్టాలిన్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2025 | 12:22 PM