Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:45 PM
దేశ రాజధాని ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలకుపైగా నష్టం వచ్చిందని సీఎం రేఖ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ లిక్కర్ స్కాం అవినీతి లెక్కల గురించి ప్రస్తావించారు.

ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో అసెంబ్లీలో ప్రస్తావించింది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వంపై వచ్చిన మొత్తం 14 కాగ్ నివేదికల్లో ఒకటైన లిక్కర్ స్కాం(Liquor Scam)లో భారీగా ఉల్లంఘనలు జరిగాయన్న కాగ్ నివేదికను సమర్పించారు. కాగ్ నివేదిక ప్రకారం 2021-2022 లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రూ.2,000 కోట్లకుపైగా నష్టపోయినట్లు వెల్లడించారు సీఎం రేఖ గుప్తా. ఈ కాగ్ నివేదిక కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో జరిగిన స్కాంకు సంబంధించి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నెలల తరబడి తీహార్ జైలులో ఉన్నారని గుర్తు చేశారు సీఎం.
ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఖజానాకు రూ. 941.53 కోట్ల ఆదాయ నష్టం రాగా, లైసెన్స్ ఫీజుల రూపంలో దాదాపు రూ. 890.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు రేఖ గుప్తా. దీంతోపాటు కొన్ని ఇతర మినహాయింపుల కారణంగా రూ. 144 కోట్ల నష్టం వచ్చిందన్నారు. జోనల్ లైసెన్స్‌ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ. 27 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పారు. వీటన్నింటినీ కలిపితే మొత్తం నష్టం రూ. 2002 కోట్లు అవుతుందని కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే మద్యం విధానంలో మార్పులను సూచించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సిఫార్సులను కూడా అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా విస్మరించారని రేఖ గుప్తా పేర్కొన్నారు.
కాగ్ నివేదిక ప్రకారం ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ పాలసీ 2010లోని 35వ నిబంధనను అమలు చేయడంలో విఫలమైంది. ఈ కారణంగా టోకు వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వబడ్డాయి. ఇది మొత్తం లిక్కర్ సేల్స్ అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ కారణంగా మద్యం తయారీ, టోకు, రిటైల్ వ్యాపారుల మధ్య సమన్వయం దెబ్బతింది. ఆ క్రమంలో టోకు వ్యాపారుల లాభాలు 5 నుంచి 12 శాతం పెరిగాయి. కానీ ఆదాయం తగ్గింది. అయితే ఆప్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండానే రిటైల్ విక్రేతలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ విషయంలో ఆర్థిక పత్రాలు లేదా వారి నేర చరిత్ర వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు.
ఆ క్రమంలోనే లైసెన్స్ జారీ చేసే ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని నిపుణుల ప్యానెల్ తెలిపింది. ఆ క్రమంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాకు విషయం చెప్పినా కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో కేజ్రీవాల్ ప్రభుత్వ ఒక లిక్కర్ షాపు దరఖాస్తుదారులకు 50కిపైగా మద్యం దుకాణాలను ఆమోదించిందని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో గతంలో పరిమితి రెండు మాత్రమే ఉండేది. ఇది మద్యం గుత్తాధిపత్యానికి, నిల్వకు కూడా అవకాశం లభించింది.
ఈ కారణంగా కొంతమంది టోకు వ్యాపారులు గుత్తాధిపత్యాన్ని పొందారు. పోటీ తగ్గడం వల్ల ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోయింది. ఆర్థికంగా భారీ ప్రభావాన్ని చూపే మినహాయింపులు, రాయితీలను మంత్రివర్గ ఆమోదం లేకుండా లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌తో సంప్రదించకుండానే ఇచ్చారు. కాగ్ కూడా దీనిని ఎగవేతగా పరిగణించింది. మద్యం ధర నిర్ణయించడంలో కూడా పారదర్శకత పాటించలేదు. 2021 ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ప్రకారం, కొన్ని ప్రదేశాలలో మద్యం దుకాణాలను తెరవడంపై నిషేధం ఉంది. కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం ప్రతి వార్డులో కనీసం రెండు రిటైల్ దుకాణాలు తెరవాలని పేర్కొన్నారు. ఇది క్రమంగా ఆప్ ప్రభుత్వానికి ముప్పుగా మారింది.
ఇవి కూడా చదవండి:
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News