China: సెకనుకు 100 జీబీ డేటా!
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:33 AM
అత్యంత వేగంగా డేటాను సరఫరా(ట్రాన్స్‌మిట్) చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ను అధిగమించినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది.
6జీ రేసులో మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌ను దాటేసిన చైనా
జిలిన్ నుంచి గ్రౌండ్‌స్టేషన్‌కు డేటా పంపిన చాంగ్‌గ్వాంగ్
జిలిన్ శాటిలైట్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు డేటా ట్రాన్స్‌మిట్ చేసిన ‘చాంగ్ గ్వాంగ్’ సంస్థ
న్యూఢిల్లీ, జనవరి 2: అత్యంత వేగంగా డేటాను సరఫరా(ట్రాన్స్‌మిట్) చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ను అధిగమించినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. చైనాకు చెందిన చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్‌మిట్ చేసేలా అత్యాధునిక హైరిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్‌పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్‌కు ఈ డేటాను సెకనులోనే పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ప్రయాణించింది. చాంగ్ గ్వాంగ్ సంస్థ లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ల అధిపతి వాంగ్ హాంగ్‌హాంగ్ మాట్లాడుతూ.. స్టార్‌లింక్ 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందన్నది అధికారిక సమాచారం కాదని చెప్పారు. ఈ విషయంలో తమ టెక్నాలజీ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీని అధిగమించేసిందన్నారు. ‘‘మస్క్‌కు చెందిన స్టార్‌లింక్.. లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది.
కానీ, దాన్ని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్‌కు ఇప్పటి వరకు వాడలేదు. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు. కానీ, మేం ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టాం’’ అని వెల్లడించారు. ఈ కంపెనీ జిలిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తిగా కక్ష్యలోకి చేర్చనుంది. 100 జీబీపీఎస్ డేటా అంటే.. 10 పూర్తిస్థాయి సినిమాల పరిమాణంలో ఉంటుంది. దీన్ని చైనా సంస్థ ఒక్క సెకన్‌లో సరఫరా చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్‌ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్స్ సంస్థ కూడా 100 జీబీపీఎస్ ట్రాన్స్‌మిట్ చేసింది. అయితే తమ సంస్థ పేలోడ్ చాలా పెద్దదని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5జీ కమ్యూనికేషన్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వెర్షన్ 6జీ. దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణంలో కూడా మూడు కిలోమీటర్ల పరిధిలో 10,000 మంది వరకు అత్యంత సురక్షితంగా, వేగంగా డేటాను పంపిస్తుంది. దీన్ని చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఆ దేశ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.