Rajnath Singh: పీఓకే లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణం
ABN , Publish Date - Jan 14 , 2025 | 07:01 PM
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం లేకుంటే జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని ఆయన పేర్కొన్నారు.
శ్రీనగర్, జనవరి 14: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లేకుంటే.. జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇది భారతదేశం నుదిటిన కిరీట రత్నమని ఆయన అభివర్ణించారు. అలాంటి ప్రదేశంలో పాకిస్థాన్ సీమాంత ఉగ్రవాదాన్ని ఎగతోస్తోందని ఆయన మండిపడ్డారు. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్‌లో నిర్వహించిన తొమ్మిదో ఆర్మడ్ రిజర్వ్ పోర్సెస్ వెటరన్స్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ నుండి భారత దళాలను తరిమికొట్టడానికి తన ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తుందంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము ఆర్టికల్ 370ని రద్దు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే అందరికి అర్థమవుతోందన్నారు.
పాకిస్థాన్‌కు పాక్ అక్రమిత కాశ్మీర్ .. విదేశీ భూభాగం తప్ప మరేమి కాదని ఆయన కుండ బద్దలు కొట్టారు. మన దేశంతో చేసిన అన్ని యుద్దాల్లో పాకిస్థాన్ ఓటమి పాలైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. 1965 నాటి నుంచి భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచేందుకు అక్రమ చోరబాట్లను సైతం ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్‌పై మండిపడ్డారు.
ఈ అక్రమ చొరబాట్లతోపాటు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపే ప్రక్రియను ఆ దేశం ఇంకా కొనసాగిస్తోందని విమర్శించారు. అంతేకాదు.. పాకిస్థాన్‌తోపాటు పాక్ అక్రమిత జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలు మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని.. అందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 1947లో ఈ భూభాగాన్ని ఆక్రమంగా పాక్ ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతంలోని అమాయక ప్రజలను ఆ దేశం రెచ్చగొడుతోందంటూ పాక్‌పై నిప్పులు చెరిగారు.
Also Read: మహాకుంభ మేళపై ఆసక్తికర వ్యాఖ్యలు.. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత
Also Read: సోషల్ మీడియాలో ఫొటో వైరల్..
1965లో ఉగ్రవాదం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో సైతం జమ్మూ కాశ్మీర్‌లోని ముస్లిం ప్రజలు.. పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వలేదని రక్షణ మంత్రి సోదాహరణగా వివరించారు. అయినా.. నేటికి పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని వదులు కోలేదన్నారు. నేటికీ పాకిస్థాన్ నుంచి 80 శాతానికిపైగా ఉగ్రవాదులు భారత్‌లోకి వస్తున్నారని తెలిపారు.
Also Read: బీజేపీ నేతలపై సీఎం సిద్దరామయ్య ఫైర్
Also Read: వీడియో వైరల్.. ప్రిన్సిపల్‌పై వేటు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడానికి గల కారణాలను వివరిస్తూ.. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీపై సైతం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఇక జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజల హృదయాలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఢిల్లీని, జమ్మూ కశ్మీర్‌ను తమ ప్రభుత్వం సమానంగా చూస్తుందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.
For National New And Telugu News