Danish Ali: మన్మోహన్‌కు అవమానం.. ప్రణబ్‌కు గిఫ్ట్
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:41 PM
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు రాజ్‌ఘాట్ మెమోరియల్ సైట్ వద్ద స్థలం కేటాయించాలని యావద్దేశం డిమాండ్ చేస్తే దానిని తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం అదే స్థలంలో ముఖర్జీ స్మారకానికి నిర్ణయించిందని డేనిష్ అలీ అన్నారు.
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి స్మృతి ఏరియా కాంప్లెక్స్ వద్ద స్మారకం ఏర్పాటు చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత డేనిష్ అలీ (Danish Ali) మండిపడ్డారు. మరణాలను కూడా నీచ రాజకీయాలకు బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు. మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు రాజ్‌ఘాట్ మెమోరియల్ సైట్ వద్ద స్థలం కేటాయించాలని యావద్దేశం డిమాండ్ చేస్తే దానిని తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం అదే స్థలంలో ముఖర్జీ స్మారకానికి నిర్ణయించిందని అన్నారు. ఇది దేశంలో ఆర్థిక విప్లవం తీసుకుచ్చిన ప్రధానమంత్రిని (మన్మోహన్) దారుణంగా అమానించడమేనని సామాజిక్ మాధ్యమం 'ఎక్స్'లో డేనిష్ అలీ విమర్శించారు.
Pranab Mukherjee: ఢిల్లీలో ప్రణబ్ స్మారక స్థూపం
ఆర్ఎస్ఎస్‌పై ప్రణబ్ ప్రేమ చూపినందుకే...
నాగపూర్‌లో 2018లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని డేనిష్ అలీ గుర్తు చేశారు. ''సంఘ్‌పై ప్రణబ్ చూపించిన ప్రేమకు ప్రతిగానే ఆయన కేంద్రం తాజా గిఫ్ట్ ఇచ్చింది. నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ప్రణబ్ తలవంచి, సంఘ్ వ్యవస్థాపకుడు హేడ్గేవార్ పేరిట ఏర్పాటు చేసిన ధర్మపుత్ర టైటిల్‌ను అందుకున్నారు. పార్లమెంటు హౌస్‌లో సావర్కర్ చిత్తరువు ఏర్పాటులో కూడా ప్రణబ్ కీలక పాత్ర పోషించారు'' అని డేనిష్ అలీ తెలిపారు.
కాగా, దీనికి ముందు ప్రణబ్ ముఖర్జీ స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌ఘాట్ కాంప్లెక్స్ పరిధిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో దీన్ని నెలకొల్పనుంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తనకు లేఖ పంపారని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ తెలిపారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రణబ్ చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కాలేదంటూ ఇటీవల శర్మిష్ఠ విమర్శలు చేశారు. కాంగ్రెస్ వెటరన్ నేత అయిన ప్రణబ్ ముఖర్జీ గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకూ భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 2020 ఆగస్టు 31న ప్రణబ్ కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections 2025: రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. కాంగ్రెస్ మరో స్కీమ్
Supreme Court: సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి
ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్ పోల్’
Read Latest National News and Telugu News