Indian Navy: అగ్రశేణి నౌకాదళంగా భారత్
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:05 AM
ఒకేసారి శక్తిమంతమైన అస్త్రాలు మూడు చేరడంతో భారత నౌకాదళం మరింత సమున్నతమైంది. ముంబై నావల్ డాక్ యార్డ్ నుంచి భారత నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డిస్ట్రాయర్, ఓ ఫ్రిగిట్, మరో జలాంతర్గామి భారత అమ్ములపొదిలోకి చేరాయి.

నౌకాదళానికి ఇది చిరస్మరణీయమైన రోజు
3 శక్తిమంతమైన అస్త్రాలు ఒకేసారి చేరాయి
విశ్వ భాగస్వామిగా మన నౌకాదళం ఎదగాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన
2 యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ జాతికి అంకితం
నవీ ముంబైలో ఇస్కాన్ ఆలయం ప్రారంభం
ముంబై, జనవరి 15: ఒకేసారి శక్తిమంతమైన అస్త్రాలు మూడు చేరడంతో భారత నౌకాదళం మరింత సమున్నతమైంది. ముంబై నావల్ డాక్ యార్డ్ నుంచి భారత నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డిస్ట్రాయర్, ఓ ఫ్రిగిట్, మరో జలాంతర్గామి భారత అమ్ములపొదిలోకి చేరాయి. యుద్ధనౌకలైన ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. భారత సముద్ర వారసత్వం, నౌకాదళ చరిత్ర, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు ఇది చిరస్మరణీయమైన రోజు అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మూడు శక్తిమంతమైన అస్త్రాలు ఒకేసారి నౌకాదళంలో చేరడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. ఇవి స్వదేశంలో తయారు కావడం అత్యంత గర్వకారణమని కొనియాడారు. వీటి రాకతో ప్రపంచంలోనే ఓ అగ్రశ్రేణి నౌకాదళంగా భారత్ అవతరించిందని అభివర్ణించారు. అంతర్జాతీయ జలాల్లో రక్షణాత్మక చర్యలు చేపట్టడంలో భారత పాత్ర గణనీయంగా పెరిగిందని, మొత్తం హిందూ మహా సముద్ర ప్రాంతంలో తొలిగా స్పందించేది భారత్ అని, ఈ ప్రాంతంలో మన సైనికులు వందలాది మంది ప్రాణాలను కాపాడారని మోదీ తెలిపారు. కీలకమైన మారిటైమ్ శక్తిగా ఎదుగుతున్న భారత్.. జల సరిహద్దులు, స్వేచ్ఛాయుత సముద్రయానం, వ్యాపార మార్గాలను కాపాడటంలో ముఖ్యమైన పోషించాలని చెప్పారు.
భారత్‌ది అభివృద్ధి వాదం..
భారత్‌ది విస్తరణ వాదం కాదని, అభివృద్ధి స్ఫూర్తితోనే మనదేశం పనిచేస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సహకారం, అభివృద్ధికి భారత్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలో కీలకమైన శక్తిగా ఎదిగేందుకు విశాల దృక్పథంతో చేపడుతున్న చర్యలను కూడా మోదీ వివరించారు. సముద్రగర్భంలోని అత్యంత లోతులను శోధించే శక్తిని భారత్ పెంచుకుంటోందని, 6 వేల మీటర్ల లోతుల్లో కూడా అన్వేషణ కొనసాగించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించామని వెల్లడించారు. నౌకాదళంలో ‘మేడిన్ ఇండియా’ శక్తిసామర్థ్యాలు శరవేగంగా పెరగడాన్ని గర్వకారణమన్న మోదీ.. దీనికి 2014 నుంచి రెండింతలైన నౌకాదళ శక్తి నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 33 నౌకలు, ఏడు జలాంతర్గాములను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. సముద్ర వ్యవహారాల్లో కూడా గ్లోబల్ లీడర్‌గా ఎదిగే బాటలో భారత్ ఉందని అన్నారు.
ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
ముంబై పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. నవీ ముంబైలోని ఖర్గార్‌లో నిర్మించిన ఇస్కాన్ ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. సేవా స్ఫూర్తిలోనే భారత ఆధ్యాత్మిక మూలాలు ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. ప్రజా శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం దశాబ్దకాలానికి పైగా నిస్వార్థంగా పనిచేస్తోందని చెప్పారు. సేవా స్ఫూర్తి నిజమైన సామాజిక న్యాయానికి, లౌకికవాదానికి ఆలంబనగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. యువకుల్లో ఇస్కాన్ సేవాస్ఫూర్తిని నింపుతోందని కొనియాడారు.