Share News

RG Kar Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి అతడే.. శిక్ష ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:00 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

RG Kar Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి అతడే.. శిక్ష ఎప్పుడంటే..?
Sanjay Roy

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దోషి సంజయ్ రాయ్‌కు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. 2024 ఆగష్టు9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాలతో సంజయ్‌ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది.


పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ) వైద్యురాలిపై 2024 ఆగష్టు9వ తేదీన అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. పీజీ సెకండియర్‌ చదువుతున్న ఆమె.. గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని అప్పట్లో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఈ కేసులో సంజయ్‌ రాయ్‌ని నిందితుడిగా గుర్తించారు. ఈ కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అనంతరం కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.


స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్‌ హాల్‌లో ట్రెయినీ డాక్టర్‌ తన బ్రేక్‌ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్‌రేప్‌ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్‌మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాలు చార్జిషీట్‌లో పేర్కొన్నాయి. ఎట్టకేలకు న్యాయస్థానం సీబీఐ సమర్పించిన ఆధారాలతో సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 18 , 2025 | 03:12 PM