Maha Kumbh Mela: త్రివేణి సంగమం భక్తజన సంద్రం
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:34 AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో (గంగ, యమున, సరస్వతి) పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున భక్తులు తొలి స్నానాలు ఆచరించడంతో 45 రోజులు సాగే ఈ మహాపర్వానికి తెర లేచింది.
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన మహా కుంభమేళా
తొలిరోజు కోటిన్నర మంది భక్తుల పుణ్య స్నానాలు
జై శ్రీరామ్, హరహర మహాదేవ.. నినాదాల హోరు
‘‘భక్తి, నమ్మకం, సంస్కృతుల పవిత్ర సంగమంలో అసంఖ్యాక జనరాసులను మహా కుంభమేళా ఒక దగ్గరకు చేర్చింది. కాలాతీత ఆధ్మాత్మిక వారసత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ, విశ్వాసాన్నీ ఈ వేడుక ప్రతిబింబించింది’’
- ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ.
న్యూఢిల్లీ, జనవరి 13 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో (గంగ, యమున, సరస్వతి) పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున భక్తులు తొలి స్నానాలు ఆచరించడంతో 45 రోజులు సాగే ఈ మహాపర్వానికి తెర లేచింది. వాయిద్యాల చప్పుళ్లు, భజనలతో సంగమ తీరం అలౌకిక ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. జై గంగామయి, జై శ్రీరామ్, హరహర మహాదేవ... అంటూ స్నానఘట్టాలు హోరెత్తుతున్నాయి. తొలిరోజు 1.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు అంచనా. ఈ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్లమంది భక్తులు తరలివస్తారని అంచనా. అంటే.. రష్యా, అమెరికా వంటి అగ్రదేశాల జనాభా కంటే కూడా అధికంగానే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
ఏకంగా ‘నగరాన్నే’ నిర్మించేశారు.
నాలుగు వేల హెక్టార్లలో ‘మహా కుంభమేళ’ నగరాన్నే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇది ప్రపంచంలోనే అతి విస్తారమైన తాత్కాలిక నగరం. ఇక్కడ ఏ సమయంలోనైనా యాభై లక్షలమంది నుంచి కోటిమంది ఉండవచ్చు. ఈ నిర్మాణాల కోసం, ఇతరత్రా సౌకర్యాల కల్పన కోసం ఆ రాష్ట ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చుచేసింది. భక్తులపై ఇంత వ్యయం చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి...వారివల్ల కనిష్ఠంగా రూ. రెండు లక్షల కోట్ల మేర ఆర్థిక వృద్ధి సమకూరనున్నదని అంచనా. 40 కోట్లమంది భక్తులు సగటున ఐదు వేలు చొప్పున ఖర్చుచేస్తే సమకూరే ఆర్థిక ప్రయోజనం ఇదీ. అదనంగా ఆహార పదార్థాలు, పానీయాల విక్రయాలద్వారా మరో రూ.20 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. యూపీ కనీసమాత్ర, వాస్తవ జీడీపీలో ఒక శాతం పెరుగుదలకు ఈ వృద్ధి దోహదపడుతుంది. దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. 2019లో జరిపిన అర్ధ కుంభమేళాలో 24 కోట్లమంది భక్తులు పాల్గొనగా, రాష్ట్ర ఖజానాకు రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఇలా చూస్తే.. ఈసారి రూ. రెండు లక్షల కోట్లు తేలిగ్గా సమకూరతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విదేశీ భక్తుల హడావుడి
దాదాపు 13 అఖాడాలకు చెందిన వేలాది మంది సాధుసంతులు మహాకుంభమేళాలో పాలుపంచుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి త్రివేణి సంగమ తీరానికి అతి భారీ ఎత్తున చేరుకుంటున్న భక్తులు.. స్నానఘట్టాల వద్ద జరిగిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగమ తీరంలోని నందీద్వారం వద్ద నెలకొల్పిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల కటౌట్ల వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
‘విగ్రహం’ చుట్టూ వివాదం..
మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీస్తోంది. విగ్రహం ఉన్నచోట శిబిరం ఏర్పాటుచేసి సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఆహారం, వసతిని భక్తులకు కల్పిస్తున్నారు. అయితే, తన పాలనాకాలంలో హిందూ, సనాతన వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన ములాయం విగ్రహం ఇక్కడ పెట్టడం ఏమిటంటూ కొందరు భక్తులు, హిందూ సంస్థల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిములకు అనుకూలంగా, ఆయోధ్య ఆలయ ఉద్యమానికి వ్యతిరేకంగా నాడు ములాయం నిలిచారని అఖిల భారతీయ అఖాడా పరిషత్ మహంత్ రవీంద్ర పూరీ తెలిపారు. కోట్లాదిమంది హిందూ భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించే స్థలంలో అలాంటి నేత విగ్రహం పెట్టడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ములాయం పట్ల తమకు రాజకీయంగా ఏ వ్యతిరేకతా లేదన్నారు.