Delhi Chief Minster: గురువారం అట్టహాసంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:50 PM
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని భారత్ చేరుకున్నాక ఢిల్లీ సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుందని సమాచారం. బుధవారం ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్‌పీ నేతను ఎన్నుకుంటారట.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ ఇంకా ప్రకటించలేదు. అయితే, గురువారం ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ యోచిస్తోందని తెలిసింది. ఈ దిశగా కొత్తగా ఎన్నికైన బీజేపీ నేతలు బుధవారం సమావేశమైన సీఎల్‌పీ నేతను ఎన్నుకోనున్నారట (Delhi CM Oath taking Ceremony).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అమెరికా పర్యటనలను ముగించుకుని వచ్చే వరకూ ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు పార్టీ వాయిదా వేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆప్‌ను మట్టికరిపించి విజయం సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆథిషి కొనసాగుతున్నారు.
USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్
ఇక నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగొచ్చిన అనంతరం అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ఆ తరువాత ఢిల్లీ పార్టీ నాయకత్వంతో కూడా సమావేశమై ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ ప్రమాణస్వీకార కార్యక్రమం మాత్రం భారీ స్థాయిలో ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీకి చెందిన సుమారు 200 మంది ప్రస్తుత, మాజీ ఎంపీలు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల, రాష్ట్రాల నేతలు, కార్యకర్తల సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం.
ఢిల్లీలో తరచూ భూకంపాలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు!
ఇక ఢీల్లీ కొత్త ప్రభుత్వంలో సభ్యులకు సంబంధించి మొత్తం 15 మంది నేతలతో ఓ జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఎంపిక ఈ జాబితా నుంచే జరుగుతుందని జాతీయ మీడియా చెబుతోంది. ఫలితంగా ఎనిమిది మంత్రులతో ఢిల్లీ కేబినెట్ కూర్పు ఉంటుందట. ఇక ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై గెలిచిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ పీఠం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత వీరేంద్ర సచ్‌దేవ, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్, బ్రాహ్మణవర్గానికి చెందిన బీజేపీ నేత సతీశ్ ఉపాధ్యాయ్ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 సీట్లల్లో విజయం కేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి