Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:10 PM
PM Modi Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం.. తొలి రోజు కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
![Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం](https://media.andhrajyothy.com/media/2024/20241209/farmers_good_news_4b7d17670b_v_jpg.webp)
న్యూఢిల్లీ, జనవరి 01: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆవన్నీ రైతుల సంక్షేమం కోసమే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు వివరించారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ. 800 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోదాహరణగా వివరించారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు భేటీ అయిన.. ఈ తొలి కేబినెట్‌ను రైతులకు అంకితం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.
ఇక ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే 50 కిలోల బస్తా డీఏపీ.. రూ.1,350కి రైతులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ డీఏపీ ఎరువులపై అదనపు భారాన్ని భరించాలని కేంద్రం నిర్ణయించిందని సోదాహరణగా ఆయన వివరించారు.
డీఏపీ ఎరువుల సబ్సీడీకి అదనంగా రూ.3,850 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి గతేడాది వరకు.. అంటే 2024 చివరి వరకు.. ఎరువుల సబ్సీడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. అదే విధంగా 2024లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది.
For National News And Telugu News