Rahul Gandhi: కొత్త టెక్నాలజీ ఉత్పత్తికి విజన్ కావాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:36 AM
వట్టి మాటలు చెప్పడం కాదు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలంటే స్పష్టమైన విజన్ భారత్‌కు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వట్టి మాటలు చెప్పడం కాదు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలంటే స్పష్టమైన విజన్ భారత్‌కు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అపారమైన ప్రతిభ అందుబాటులో ఉందన్న ఆయన.. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు బలమైన పునాది అవసరమని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అలాగే ఆయన తొమ్మిది నిమిషాల వీడియోలో డ్రోన్ టెక్నాలజీ గురించి చెప్పుకొచ్చారు.
ఈ రంగంలో పోటీగా నిలిచేందుకు ఒక వ్యూహం రచించాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టవశాత్తు ప్రధాని మోదీ దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కృత్రిమ మేధ(ఏఐ)పై ఆయన టెలీప్రాంప్టర్‌లో ప్రసంగాలు చేస్తుంటే.. మన పోటీదారులు కొత్త టెక్నాలజీల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.