Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:52 PM
ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధిపొందుతున్న మహిళలంతా తనను ‘నాన్నా..! నాన్నా’ అని పిలుస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆ పిలుపొక్కటే సుపరిపాలనకు నిదర్శనమని సీఎం స్టాలిన్ అన్నారు.
- ఏడోసారి అధికారంలోకి వస్తాం
- టంగ్‌స్టన్ తవ్వకాలు జరగనివ్వం: సీఎం
చెన్నై: ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధిపొందుతున్న మహిళలంతా తనను ‘నాన్నా..! నాన్నా’ అని పిలుస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆ పిలుపొక్కటే సుపరిపాలనకు నిదర్శనమని సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు. ఇప్పటి వరకు తాను 12వేల ఫైళ్లపై సంతకాలు పెట్టానని, వాటిలో సంక్షేమ పథకాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయన్నారు. శనివారం ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు ముగిసిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ మూడున్నర సంవత్సరాలుగా సాగుతున్న డీఎంకే పాలనను చూసి ప్రజలంతా మెచ్చుకుంటున్నారని, వారి మద్దతుతో ఏడోసారి అధికారంలోకి వస్తామన్నారు. ముఖ్యమంత్రి(Chief Minister)గా పదవీ స్వీకారం చేసిన రోజు వెలుగుబాట పయనం పేరుతో మహిళలకు సిటీ, టౌన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకానికి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేశానని, ప్రస్తుతం ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలంతా వారు ప్రయాణించే బస్సులను ‘స్టాలిన్ బస్సులు’ అని పిలుస్తుండటం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Delhi Assembly Elections: కాంగ్రెస్ ఏకాకి!
గవర్నర్ తీరు విచిత్రం...
గత మూడేళ్లుగా శాసనసభలో గవర్నర్ ప్రవర్తిస్తున్న తీరును గమనిస్తే ‘ఈ న్యాయస్థానం ఎన్నో విచిత్రమైన కేసులను ఎదుర్కొన్నది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పరాశక్తి చిత్రంలోని కోర్టు సీన్‌లో రాసిన డైలాగ్ గుర్తుకు వస్తోందన్నారు. ‘యేటా గవర్నర్ ప్రసంగం చేయడానికి వస్తారు, ప్రసంగించకుండానే వెళతారు, లేకుంటే జాతీయగీతం వినిపించాలంటూ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారు’ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనం 176వ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం అందించే ప్రసంగాన్ని యధాతథంగా పఠించాలన్న విషయాన్ని గవర్నర్ గుర్తించడమే లేదన్నారు.
2021లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ 2022లో శాసనసభ తొలి సమావేశంలో ప్రభుత్వ ప్రసంగాన్ని ఫుల్‌స్టా్‌పలు, కామాలను కూడా వదలకుండా ఉన్నదున్నట్లుగా పఠించారని, గత మూడేళ్లుగా కుంటిసాకులు చెబుతూ గవర్నర్ ప్రసంగపాఠాన్ని చదవడమే మానుకున్నారని, శాసన సభలో ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఆయన దృష్టిలో సాధారణమైన వ్యక్తిగా అగుపించవచ్చును గానీ, శాసనసభ సామాన్యమైనది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో గవర్నర్ ప్రవర్తిస్తున్న తీరు ఈ సభ ఇప్పటివరకూ చూడని దృశ్యాలన్నారు. రాజకీయపరంగా గవర్నర్ తమను తూలనాడటాన్ని పెద్దగా పటించుకోమని, ద్రావిడ ఉద్యమమే ఇతరుల ఉదాశీనతలను ఎదుర్కొని ఆవిర్భవించిందన్న విషయాన్ని ఎవరూ మరువరని స్టాలిన్ అన్నారు.
ప్రదర్శనలకు అనుమతి...
ప్రజా సమస్యలపై ప్రదర్శనలు నిర్వహించేందుకు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనుమతి ఇవ్వడం లేదని అన్నాడీఎంకే, బీజేపీ(BJP) చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు. ఆందోళన చేసేందుకుంటూ కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నామని, ఆ ప్రాంతాల్లో ఆందోళన జరిపేందుకు ఒకటీరెండు రోజులకు ముందు అనుమతి కోరితే పోలీసులు తప్పకుండా ఇస్తారని చెప్పారు. ఇక శాసనసభకు అన్నాడీఎంకే(AIADMK) సభ్యులు నల్లచొక్కాలు ధరించి రావటం తనకెలాంటి ఆగ్రహం కలిగించలేదని, ఆ పార్టీకి దమ్ముంటే శాసనసభను వరుసగా అవమానపరుస్తున్న గవర్నర్‌కు వ్యతిరేకంగానో, లేదా రాష్ట్రానికి నిధులివ్వకుండా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తూనో ఆందోళన జరపాలన్నారు. మహిళపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను విచారణ జరిపేందుకు రాష్ట్రంలో ఏడు ప్రత్యేక కోర్టులను చెన్నై, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, తిరుచ్చి నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
టంగ్‌స్టన్‌పై అనుమానాలు వద్దు...
టంగ్‌స్టన్ తవ్వకాలపై ప్రతిపక్షాలు అదే పనిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని, ఈ విషయమై ఇదివరకే తాను స్పష్టమైన ప్రకటన చేశానని, ఈ తవ్వకాలకు మద్దతుగా అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై పార్లమెంట్‌లో ప్రసంగించారని, డీఎంకే సభ్యులు వ్యతిరేకిస్తూ మాట్లాడారని చెప్పారు. ఇక మదురై సమీపం మేలూరు వద్ద టంగ్‌స్టన్ తవ్వకాలు జరిగితే తాను ముఖ్యమంత్రిగా ఉండే ప్రసక్తేలేదని కూడా ఇంతకుమునుపే స్పష్టంగా తెలిపానని స్టాలిన్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో 10 సభ్యులు 112 సవరణలు ప్రతిపాదించారని, అవన్నీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని సవరించి ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నానని, సభ్యులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత మూజువాణి ఓటు ద్వారా తీర్మానం నెరవేరినట్లు స్పీకర్ అప్పావు ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు.
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News