Share News

Vijay: ఇక విజయ్ ఒంటరేనా.. అమిత్‌షా-ఈపీఎస్ భేటీతో డైలమాలో ‘టీవీకే’

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:54 PM

తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ హీరో విజయ్ ఒంటరిగానే మిగిలిపోనున్నారా.., వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే తలపడనున్నారా.. అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అలా అయితే.. అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పావంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

 Vijay: ఇక విజయ్ ఒంటరేనా.. అమిత్‌షా-ఈపీఎస్ భేటీతో డైలమాలో ‘టీవీకే’

- బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుతో పునరాలోచనలో విజయ్‌ పార్టీ

చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి ఒంటరి పోరు తప్పదా?.. ఆయనతో కలిసొచ్చే పార్టీలు కరువయ్యాయా?.. అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. లేనిపక్షంలో ఆయన మనసు మార్చుకుని ఇన్నాళ్లూ తను ప్రశ్నించిన పార్టీలతోనే జత కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా వున్న అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌).. బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో మంగళవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. కూటమి గురించి మాట్లాడలేదంటూ ఆయన చెబుతున్నప్పటికీ, అది తప్ప మరొక అవసరమేమీ ఆ నేతల భేటీకి కారణం ఏదీ కనిపించడం లేదు. అయితే బీజేపీతో తమ పొత్తు ఖరారైనట్లేనని అన్నాడీఎంకే వర్గాలు సైతం పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ దారెటు అన్నదానిపై ఆయన అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Mk Stalin: కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..


అప్పుడు దూరమై... ఇప్పుడు దగ్గరై..!

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టి పోటీ చేసిన అన్నాడీఎంకే.. మైనారిటీల ఓట్లు తమకు దూరమయ్యాయన్న కారణంగా తమ మిత్రుణ్ని దూరం పెట్టింది. అయితే బీజేపీతో చెలిమి లేకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అనంతరం అన్నాడీఎంకే నేతలపై వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు.. పార్టీలో అంతర్గత కలహాల కారణంగా సతమతమైపోయిన ఈపీఎస్‌.. ఎట్టకేలకు బీజేపీ దారి పట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన కాషాయ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పాటు కలిసి సాగిన బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌ ఆ తరువాత విడిపోయ్డాయి. ఇప్పుడు మళ్లీ ఇదే కూటమి ఒకే గాటున రావడం ఖాయమైంది. ఈ కూటమిలోకి అదనంగా డీఎండీకే, నామ్‌ తమిళర్‌ కట్చి చేరడం దాదాపు ఖాయమైంది.


పటిష్ఠంగా డీఎంకే మిత్రుల బంధం

డీఎంకే కూటమిలోని మిత్రపక్షాల బంధం పటిష్ఠంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆ కూటమిలో డీఎంకేతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే తదతర పార్టీలున్నాయి. ఇందులో ఒక్క డీపీఐ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఇప్పటికే డీఎంకే పట్ల అచంచల విశ్వాసం కనబరుస్తున్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇదే కూటమి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కూటమిలోకి అదనంగా సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని మణిదనేయ మక్కల్‌ కట్చి చేరింది.


ఇప్పుడు విజయ్‌ దారెటు?

2021 ఎన్నికల్లో డీఎంకే కూటమికి 45.38 శాతం ఓట్లు, అన్నాడీఎంకే కూటమికి 39.72 శాతం ఓట్లు పోలయ్యాయి. 5.66 శాతం ఓట్ల వ్యత్యాసంతో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి అన్నాడీఎంకేతో టీవీకే చేరితే ఈ శాతం మారిపోవడం తధ్యమన్ని అన్ని వర్గాలు భావించాయి. విజయ్‌ పార్టీ నేతలు ఏం చెప్పినా, ఆ పార్టీకి 8 శాతం ఓట్లు పోలవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో అన్నాడీఎంకేతో టీవీకే జత కడితే ఈ కూటమి విజయం తధ్యమని అన్ని వర్గాలు భావించాయి. ఆ మేరకు ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.


కానీ టీవీకే నుంచి వస్తున్న డిమాండ్లను భరించలేకపోతున్నామన్న అన్నాడీఎంకే నేతలు ఆ పార్టీకి దూరం జరిగారు. ఇప్పుడు ఏకంగా బీజేపీతో జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో విజయ్‌ పార్టీ ఏకాకిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది. తొలి మహానాడు నుంచే విజయ్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, రాష్ట్రంలో డీఎంకే పైనా నిప్పులు చెరుగుతున్నారు. దీంతో విజయ్‌ డీఎంకే కూటమితో జత కట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆయన అటువైపు మొగ్గు చూపినా అక్కడ ఆయన పార్టీకి తగినన్ని స్థానాలు లభించే అవకాశం కనిపించడం లేదు. ఇక బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే కూటమిలో చేరడం గానీ లేదా ఒంటరిగా పోటీ చేయడం గానీ విజయ్‌ ముందున్న మార్గాలు.


కానీ ఇప్పటి వరకూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్‌.. ఇంతలో మనసు మార్చుకుంటారా, లేక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పినట్లు ఒంటరి పోటీకి సిద్ధమవుతారా అన్నదానిపై ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున ఈ లోగా శత్రువులు మిత్రులు కావచ్చు, మిత్రులు శత్రువులు కావచ్చన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. నిజమే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అప్పటి వరకూ ఓటరు మహాశయుడు వేచి వుండక తప్పదు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు

ఉప ఎన్నికలు రావు

‘ఉపాధి’కి పెరిగిన పని దినాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 27 , 2025 | 12:54 PM