Today Google Doodle : ఈ రోజు గూగుల్ డూడుల్ గమనించారా.. ఈ స్పెషల్ ఆర్ట్ వెనక సీక్రెట్ ఇదే ..
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:35 PM
Google Doodle Today Nowruz 2025: ప్రత్యేక సందర్భాలను యూజర్లకు గుర్తుచేసేలా క్రియేటిల్ డూడుల్స్‌తో ఆకర్షిస్తూ ఉంటుంది గూగుల్. అలాగే ఈ రోజూ ఒక అందమైన డూడుల్ ఉండటం మీరు సెర్చ్ చేసేటప్పుడు గమనించారా. ఈ సీక్రెట్ ఆర్ట్ గురించి మీరెప్పుడూ వినే ఉండరు..

Google Doodle Today, Nowruz 2025: గూగుల్ సెర్చ్ ఇంజిన్ హోం పేజీలో ఎప్పటికప్పుడు అందమైన, క్రియేటివ్, కలర్‌ఫుల్ డూడుల్స్ యూజర్లు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆయా ప్రత్యేక సందర్భాలను ప్రతిబింబించేలా ఉండే ఈ డూడుల్ ఆర్ట్ చూసి ముచ్చటపడని వారుండరు. మీరు గమనిస్తే ఈ రోజు కూడా ఒక వింతైన డూడుల్ చూడవచ్చు. ఈ క్రియేటివ్ డూడుల్ ఆర్ట్ వెనక 3000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. పర్షియన్ నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ గూగుల్ పెండర్ యూసెఫీ అనే కళాకారుడితో ఈ సరికొత్త డూడుల్ వేయించింది.
నౌరుజ్ అంటే..
నౌరుజ్ 2025 సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ గూగుల్ ఒక స్పెషల్ డూడుల్ పెట్టింది. పర్షియన్ న్యూ ఇయర్ రోజుని నౌరుజ్ అని పిలుస్తారు. ఈ ఏడాది మార్చి 2020న వచ్చిన పర్షియన్ నూతన సంవత్సర పండగకు వేల ఏళ్లనాటి చరిత్ర ఉంది. పర్షియన్ భాషలో నౌరుజ్ అంటే "కొత్త రోజు" అని అర్థం. వసంతాన్ని స్వాగతిస్తూ తెలుగువాళ్లు ఉగాది పండగను జరుపుకున్నట్టే పర్షియన్ దేశస్థులు కూడా పర్షియన్ క్యాలెండర్ ప్రకారం నౌరుజ్ పండగ చేసుకుంటారు. పురాతన పర్షియా (ప్రస్తుతం ఇరాన్)లో పుట్టిన ఈ సంప్రదాయం మధ్యఆసియా, దక్షిణాసియా, ఐరోపా, కాకసస్ వంటి అనేక ప్రాంతాలకు విస్తరించింది.
గూగుల్ డూడుల్ అర్థం ఇదే..
గూగుల్ డూడుల్ నౌరూజ్ సంప్రదాయమైన హాఫ్ట్ సిన్ టేబుల్‌కు అద్దం పట్టేలా 7 సింబాలిక్ ఐటెమ్స్ పొందుపర్చింది. ప్రతిదీ పర్షియన్ అక్షరం "సిన్" తో ప్రారంభం కావడం విశేషం. ఇందులో పునర్జన్మ కోసం మొలకలు, బలానికి గోధుమ పుడ్డింగ్, ప్రేమ కోసం ఆలివ్‌లు, సూర్యోదయం కోసం బెర్రీలు, సహనానికి వెనిగర్, అందం కోసం ఆపిల్, ఆరోగ్యానికి వెల్లుల్లి ఉన్నాయి.
నౌరుజ్ పండగకు యునెస్కో గుర్తింపు..
జొరాస్ట్రియన్లు, పర్షియన్లు పురాతన కాలం నుంచి నౌరుజ్ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ రోజును వాళ్లు జీవితానికి పునర్జన్మగా, కొత్త ఆరంభంగా, చీకటిపై కాంతి సాధించిన విజయానికి గుర్తుగా పరిగణిస్తారు. పండగరోజున కుటుంబసభ్యులతో కలిసి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. 2010లో యునెస్కో నౌరూజ్‌ను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి మార్చి 21ని అంతర్జాతీయ నౌరూజ్ దినోత్సవంగా గుర్తించింది. నేడు నౌరుజ్ పండగని ఇరాన్, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, అజర్‌బైజాన్, కాకసస్, టర్కీ, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే దాదాపు 300 మిలియన్ల(30 కోట్ల) మంది ప్రజలు జరుపుకుంటున్నారు.
నౌరూజ్ పండగప్పుడు గుడ్లతో అలంకరించడం, మంటలపై నుంచి దూకడం వల్ల భవిష్యత్తుకు కొత్త శక్తి లభిస్తుందని నమ్ముతారు. పండగకు కొన్ని రోజుల ముందే అందరూ కొత్త సంవత్సరం కోసం ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. 13 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు రోజంతా ప్రకృతిలోనే గడుపుతారు. కుటుంబంతో కలిసి పిక్నిక్‌లను ఆస్వాదిస్తారు.
Read Also : Wife Harassment: భార్య వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన బెంగళూరు టెకీ..
Pavel Stepchenko Retirement: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. రికార్డులు సృష్టించిన యువకుడు..