Mahakumbh 2025: కుంభమేళా స్పెషల్.. నాగసాధువుగా మారడం ఎలా.. ఎంత కాలం పడుతుంది..
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:34 AM
Naga Sadhu: మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాల కోసం దేశవిదేశాల నుంచి వస్తున్న కోట్లాది మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, సంత్‌లతో ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది.

మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి వస్తున్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసిపోతోంది. అక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తూ పులకరిస్తున్నారు భక్తులు. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల్లోనూ పుణ్యస్నానాల కోసం భక్తుల రద్దీ భారీగానే ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కుంభమేళాలో నాగసాధువులు, సన్యాసులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా నాగసాధువులు రకరకాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. రథాలు, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులపై వస్తూ చేతుల్లో త్రిశూలాలు, వ్యాయామ ప్రదర్శనలు, కొన్నిసార్లు గన్‌లతో హోరెత్తిస్తున్నారు. నాగసాధువుల జీవనశైలి మీద చాలా మందికి ఎనలేని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు నాగసాధువుగా మారడం ఎలా? ఇలా మారడానికి ఎంత కాలం పడుతుంది? తదిరత వివరాలు ఇప్పుడు చూద్దాం..
నాగసాధువుగా మారడం ఎలా?
నాగసాధువులు అనగానే అఖాడా అనే పదం బాగా వినిపిస్తుంది. మామూలుగా అఖాడా అంటే రెజ్లింగ్‌కు సంబంధించినదిగా భావిస్తారు. కానీ కుంభమేళాలో మాత్రం ఇది సాధువులు, సంత్‌లు, సన్యాసుల సంప్రదాయంతో ముడిపడినదిగా చెప్పొచ్చు. కుంభమేళా టైమ్‌లోనే అఖాడాల్లోకి కొత్త సన్యాసులను చేర్చుకుంటారు. మొత్తం 15 రకాల అఖాడాలు ఉన్నాయి. వీటిల్లో ఒకదానిలో చేరడం ద్వారా సన్యాసులు భౌతిక ప్రపంచాన్ని జయించినట్లుగా భావిస్తారు. అయితే దీనికి ముందు వాళ్లు కొన్ని పరీక్షలను అధిగమించాలి.
అవన్నీ వదిలేయాలి!
ప్రతి అఖాడాకు ఒక కల్చర్ ఉంటుంది. శివుడు, విష్ణువును నమ్మే అఖాడాలతో పాటు ఉదాసి, సిక్కు అఖాడాలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 5 లక్షల మంది సాధువులు ఉన్నారని అంచనా. సన్యాసం స్వీకరించే సమయంలో ఆ వ్యక్తి ఏ వర్గం వారో ఆ వర్గం పేరుతో పాటు కొత్తపేరును జత చేస్తారు. సన్యాసిగా మారాక కుటంబ బాంధవ్యాలను త్యజించాలి. వాళ్ల పేరుకు ఆఖరున గురువు పేరును జత చేస్తారు. నాగసాధువుగా మారాలంటే తొలుత ఓ నాగసాధువు వద్ద శిష్యరికం చేయాలి. శారీరకంగా వారిలో ఎలాంటి లోపం ఉండకూడదు. 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకులు ఈ దీక్షను మొదలుపెట్టొచ్చు. దీక్ష స్టార్ట్ చేసే టైమ్‌లో వాళ్ల జుట్టును కత్తిరిస్తారు. మహా పురుష్ లేదా వస్త్రధారి అనే పేరును వాళ్లకు పెడతారు.
నాగదిగంబరులుగా మారితే..!
నాగసాధువుగా మారే వ్యక్తి సీనియర్ నాగసాధువు దగ్గర శిక్షణ తీసుకోవాలి. వ్యక్తిగతంగా గురువు ఉండరు. కానీ ప్రతి అఖాడాకు ఓ దైవం ఉంటారు. ఆ ప్రధాన దైవమే వారికి అసలైన గురువుగా చెబుతారు. శుభ్రపరచడం, వంట చేయడం, నాగఫణి వాయించడంతో పాటు అస్త్రాల వాడుకలో నైపుణ్యత సాధించడం లాంటివి నేర్చుకోవాలి. వాళ్ల దీక్ష, పట్టుదల చూసి సంతృప్తి చెందితే వారిని నాగదిగంబరులుగా దీక్ష చేయిస్తారు సీనియర్ నాగసాధువులు. ఆ సమయంలో అఖాడాలకు చెందిన మహంత్ వారితో ప్రమాణం చేయిస్తారు. ఒక్కసారి నాగదిగంబరులుగా మారితే ఇక ఇంటికి తిరిగి వెళ్లలేరు.
ఈ నిబంధనలూ పాటించాల్సిందే!
నాగసాధువుగా మారేందుకు మరికొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కుంభమేళా సమయంలో మూడ్రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ మంత్రాలు జపించాలి. అలాగే సొంతంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. 21 తరాల వారికి పిండదానం చేయాలి. అనంతరం లౌకిక ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవాలి. స్వీయ గుర్తింపును తొలగించుకోవాలి. అలాగే జుట్టు కత్తిరించుకోవాలి. కుంభమేళా జరిగే ప్రాంతంలో పొద్దునే పవిత్ర స్నానం చేయాలి. దీంతో సాధువుగా తాము పునర్జన్మ పొందామని వాళ్లు భావిస్తారు. అయితే సన్యాసి దశ నుంచి నాగసాధువుగా మారే ప్రక్రియ ఒక్కరోజులో జరిగేది కాదు. దీనికి కనీసం 2 నుంచి 12 ఏళ్ల టైమ్ పడుతుంది. నిర్దిష్టమైన కాల పరిమితి కూడా లేదు.
ఇవీ చదవండి:
అన్ని భారతీయ నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ గురించి తెలుసా?
తృణమూల్ ఎంపీకి పాడైపోయిన ఐస్‌క్రీమ్ డెలివరీ!
కొండపైకి ఎక్కతుండగా జారిపోయిన మహిళ.. చివరకు జరిగింది చూస్తే..
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి