Train Cancellation.. Reservation Ticket Refund: ప్రయాణించాల్సిన రైలు రద్దు అయింది.. టికెట్ రిఫండ్ పొందడం ఎలాగంటే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:18 PM
Train Cancellation.. Reservation Ticket Refund: మనం ప్రయాణించే సమయంలో ఒక్కొసారి రైళ్లు అర్థాంతరంగా రద్దు అవుతుంటాయి. దీంతో రిజర్వేషన్ టికెట్ ఎలా రద్దు చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇందులో రెండు పద్దతులున్నాయి. ఒకటి ఆన్ లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటారు. మరొకటి రైల్వే కౌంటర్‌కు వెళ్లి క్యూలో నిలబడి రిజర్వేషన్ చేయించుకుంటారు.

మనం రైలులో ప్రయాణించేందుకు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం. మనం ప్రయాణించే రోజు వస్తుంది. అంతలో పలు కారణాల వల్ల రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటిస్తారు. దీంతో రిజర్వేషన్ టికెట్ ఎలా రద్దు చేసుకోవాలంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే స్పష్టమైన రిఫండ్ విధానాన్ని అమలు చేస్తుంది. రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ ఉన్న ప్రయాణీకులు రైలు రద్దైతే పూర్తి రిఫండ్ పొందే అర్హతను కచ్చితంగా కలిగి ఉంటారు.ఈ ప్రక్రియ ఆన్‌లైన్ (ఈ-టికెట్), ఆఫ్‌లైన్ (కౌంటర్ టికెట్)టికెట్లకు వేర్వేరు పద్దతి ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే..
ఈ - టికెట్ రిఫండ్ పొందాలంటే..
ఒకవేళ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ-టికెట్ బుక్ చేసుకొని ఉంటే.. రైలు రద్దైనప్పుడు రిఫండ్ ప్రక్రియ ఆటోమెటిక్‌గా జరుగుతోంది. రైలు రద్దు చేయబడిన విషయం రైల్వే అధికారులు నిర్ధారించిన వెంటనే..టికెట్ కోసం చెల్లించిన నగదు మొత్తం (కన్వీనియన్స్ ఫీజు మినహాయించి) బుకింగ్ సమయంలో బ్యాంక్ ఖాతా లేదా కార్డు ద్వారా వినియోగించి ఉంటే.. అందులో ఆటోమెటిక్‌గా పడిపోతుంది. 3 నుంచి 7 పని దినాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తమ టికెట్‌ను మాన్యువల్‌గా రద్దు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దీనిని రైల్వే వ్యవస్థ పరిశీలిస్తోంది. ఆ క్రమంలో రిఫండ్ స్థితిని తెలుసుకోవడానికి.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో "మై ట్రాన్సాక్షన్స్" విభాగంలో చెక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ కల్పించింది.
రైల్వే కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసి ఉంటే..
రైలు రద్దైనప్పుడు రిఫండ్ పొందడానికి.. తొలుత రైల్వే స్టేషన్‌లోని పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రైలు రద్దు చేయబడినట్లు నిర్ధారణ అయిన అనంతరం.. షెడ్యూల్ చేసిన రైలు బయలుదేరే సమయం నుండి 3 రోజులలోపు మీ టికెట్‌ను కౌంటర్‌లో సరెండర్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించబడవు. అలాగే పూర్తి టికెట్‌కు సంబంధించిన నగదు రూపంలో మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఈ నగదు కోసం వెళ్తున్నప్పుడు.. గుర్తింపు కార్డు తీసుకు వెళ్లవలసి ఉంటుంది.
ఈ విషయాలు గమనించండి..
రైలు రద్దు కారణాలు (ప్రమాదాలు, వరదలు, సాంకేతిక సమస్యలు)అయినా.. పూర్తి రిఫండ్ అందించబడుతుంది.
ఈ-టికెట్ రిఫండ్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది కాబట్టి, రద్దు చేయడానికి ప్రయత్నించవద్దు. ఓ వేళ అలా చేస్తే.. ఇది రిఫండ్ ఆలస్యం కావడానికి దారితీయవచ్చు.
కౌంటర్ టికెట్ కోసం..3 రోజుల గడువు ముగిసిన తర్వాత రిఫండ్ క్లెయిమ్ చేయడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సి ఉంది.
రిఫండ్‌కు సంబంధిత సమస్యలు ఉంటే,ఐఆర్‌సీటీసీ కస్టమర్ కేర్ (139)ని సంప్రదించవచ్చు లేదా etickets@irctc.co.in కు ఈమెయిల్ పంపవచ్చు.
ఈ నేపథ్యంలో రైలు రద్దు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ నగదు సురక్షితంగా తిరిగి వస్తుందని గమనించాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Summer: వేసవిలో శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచాలంటే..
MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..
For Viral News And Telugu News