Share News

Danger Dreams : ఈ కలలు ఎక్కువగా వస్తే.. ఏమవుతుందో తెలుసా..

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:40 PM

కాస్తంత కునుకు పట్టగానే ఎవరికైనా కలలు రావడం సహజం. నిద్రలోకి జారుకోగానే సరికొత్త ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒక్కోసారి మనకు పరిచయంలేని వ్యక్తులు, ప్రదేశాలకూ వెళ్లిపోతుంటాం. కొంతమందికి రిపీటెడ్‌గా ఒకే విషయానికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఈ కలలు ఎక్కువగా వస్తే.. ఏమవుతుందో తెలుసా..

Danger Dreams : ఈ కలలు ఎక్కువగా వస్తే.. ఏమవుతుందో తెలుసా..
Danger Dreams

కాస్తంత కునుకు పట్టగానే ఎవరికైనా కలలు రావడం సహజం. నిద్రలోకి జారుకోగానే సరికొత్త ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒక్కోసారి మనకు పరిచయంలేని వ్యక్తులు, ప్రదేశాలకూ వెళ్లిపోతుంటాం. ఆ రోజు మన మూడ్ ఎలా ఉంది.. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అన్నదాన్ని బట్టి రకరకాల కలలకు బీజం వేస్తుంటాయి అంటారు మానసిక నిపుణులు. అందుకే, కొన్నిసార్లు మన భయందోళనలు స్వప్నాలుగా మారి ప్రమాదాల్లో చిక్కుకున్నట్లు కనికట్టు చేస్తాయి. మనసుకు నచ్చిన వారికి కళ్లెదుట నిలిపి నిజమేనేమో అనిపిస్తాయి. కొన్ని కలలు భయపెడితే, మరికొన్ని కలలు సంతోషపెడతాయి. ఇలా కష్టం, నష్టం, బాధ, భయం, సంతోషం అన్ని భావాలను కలిగిస్తాయి. కలల ప్రపంచంలో ఇదే కనిపిస్తుందని చెప్పడానికి లేదు. దానికి హద్దంటూ ఉండదు. కానీ, కొంతమందికి రిపీటెడ్‌గా ఒకే విషయానికి సంబంధించిన కలలు వస్తుంటాయి. అవన్నీ మన భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం అనేందుకు సంకేతాలని నమ్ముతారు కొందరు. ఇలాంటి కలలు తరచూ వస్తే గనక కచ్చితంగా ఈ సమస్యల్లో పడతారని అంటున్నారు కలల పరిశోధకులు. ఆ కలలు, వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


డబ్బుకు సంబంధించిన కలలు తరచూ వస్తుంటే అంత మంచిది కాదని అంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి కలలు మనం భవిష్యత్తులో డబ్బుపరమైన చిక్కుల్లో పడతామని చెప్పేందుకు సూచన అని విశ్వసిస్తున్నారు.

పూర్తికాని లావాదేవీలు

ఏదైనా కొనుగోలు చేయడంలో లేదా డబ్బులు డ్రా చేయడంలో విఫలమైనట్లు కల వస్తే, వాస్తవంగా అదే సమస్యల్లో చిక్కుకున్నారని సంకేతం. ఏదైనా అవసరానికి డబ్బు సరిపోదేమో అని సందేహపడుతూ ఉంటే ఇలాంటి కలలు పుట్టుకొస్తాయి.

క్రూర జంతువు వెంటాడితే

క్రూరమైన జంతువు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కల వస్తే అది డబ్బు సమస్యలు రాబోతున్నాయనేందుకు గుర్తు. మీ ఆర్థికంగా దిగజారిపోతామనే భయం వెంటాడుతుంటే ఇలాంటి కలలు వస్తాయి.


దోపిడీ

మిమ్మల్ని ఎవరైనా దోపిడీ చేసినట్లు కల వస్తే ఊహించని నష్టం లేదా భవిష్యత్తులో మోసపోతున్నారని చెప్పేందుకు సంకేతం. అనుకోని సంఘటనలు జరిగి డబ్బు మోసపోతారని, తెలిసివాళ్లే అలా చేస్తారని భయపడితే ఇలాంటి దుస్వప్నాలు వస్తాయి.

నగలు విరిగినట్లు వస్తే..

నగలు ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటారు. అలాంటి నగలు ఆత్మగౌరవానికి సూచిక. అవి విరిగిపోయినట్లు కల వస్తే ఆర్థికంగా నష్టంలో కూరుకుపోతున్నారని, సంపద లేదా హోదా కోల్పోతున్నారని అర్థం.

ఖాళీ పర్సు.. ఖాళీ జేబు

తగినంత డబ్బులేక బాధ్యతలు గుర్తొచ్చి దిగులుపడేవాళ్లకి, అప్పుల బెంగతో ఆర్థికంగా బలహీనపడి భయపడుతుంటే ఈ తరహా కలలు వస్తాయి.


డబ్బులు కోల్పోవడం

ఆర్థికంగా స్థిరంగా లేమని ఆందోళన పడుతుంటే డబ్బు పోగొట్టుకున్నట్టు కలలు వస్తాయంట. ఇలా రావడం అంటే మీ ఆర్థిక నిర్వహణపై మీరు నమ్మకం కోల్పోయారని అర్థం. జీవితంపైన పట్టు కోల్పోతున్నారని అనేందుకు సంకేతం.

గ్రహణాలు

కలలో సూర్యుడు లేదా చంద్ర గ్రహణాలు కనిపిస్తే అది సమస్యలు తెచ్చిపెడుతుందని సూచిక. దాగి ఉన్న లేదా అస్పష్టమైన అంశాలను గ్రహణాలు తెలియజేస్తాయి. ఇలాంటి కలలు వస్తుంటే మనసు కలత చెంది భవిష్యత్తులో తప్పు నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా చతికిలపడతారు.

పిచ్చుకలు ఎగురుతున్నట్లు వస్తే

మీ కలలో పిచ్చుకలు ఎగురుతూ పోతే అది అతి పెద్ద ఆర్థిక నష్టానికి సంకేతం. ప్రాధాన్యం లేని వాటిగా కనిపించినా, పిచ్చుకలు ఎగిరిపోవడం అంటే చిన్న మొత్తాల్లో డబ్బును క్రమంగా మీరు కోల్పోతున్నారని తెలియజేయడం.


పెద్ద శబ్దాలు వినిపిస్తే

పెద్ద శబ్దాలు కలల్లో వినిపిస్తే, అది కుటుంబంలో గొడవలకు సంకేతం. ఇలాంటి కలహాలు ఇంట్లో ఒత్తిడిని పెంచి మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి.

కూలిపోయే ఇళ్లు లేదా తుఫానులు

కలలో ఇల్లు కూలిపోవడం లేదా తుఫానులు రావడం చూస్తున్నారా.. అయితే, ఇది కష్టాలు సమీపిస్తున్నాయనేందుకు సూచన. ఇలాంటి కలలు జీవితంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని, అవి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయని సూచిస్తాయి.

Updated Date - Jan 08 , 2025 | 04:40 PM