Gautam Gambhir: టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:25 PM
Team India: విజయాల్లో ఉన్నప్పుడు ఎక్కడా ఏ సమస్య ఉన్నట్లు కనిపించదు. అదే పరాజయాలు పలకరిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ట కట్టుకొని మీద పడతాయి. ఇప్పుడు టీమిండియా సిచ్యువేషన్ అలాగే ఉంది.
IND vs AUS: విజయాల్లో ఉన్నప్పుడు ఎక్కడా ఏ సమస్య ఉన్నట్లు కనిపించదు. అదే పరాజయాలు పలకరిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ట కట్టుకొని మీద పడతాయి. ఇప్పుడు టీమిండియా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఒక్కసారిగా జట్టులోని సమస్యలన్నీ బయటపడ్డాయి. మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమితో ముప్పేట దాడి జరుగుతుండటంతో డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌతం గంభీర్ అందరు ప్లేయర్లపై సీరియస్ అవడం, టీమ్‌లో నుంచి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించడం, రూల్స్ ఫాలో అవకపోతే మామూలుగా ఉండదంటూ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే అసలు గౌతీ మాటలు బయటకు ఎలా వచ్చాయి? టీమిండియాలో ఇంటి దొంగ ఎవరు? అనే మరో డిస్కషన్ కూడా ఊపందుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
లీక్ చేసిందెవరు?
గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియా మిశ్రమ ఫలితాలు అందుకుంది. విజయాల సంగతి అటుంచితే.. శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ కోల్పోవడం, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుత ఆసీస్ టూర్‌లో టెస్టుల్లో 1-2తో వెనుకబడిన జట్టు.. చివరి మ్యాచ్‌లో ఓడితే మరో సిరీస్ సమర్పయామి అవుతుంది. ముందు నుంచి ఆటగాళ్లకు నచ్చినట్లు ఆడేలా ఫ్రీడమ్ ఇస్తూ వస్తున్న గంభీర్.. అటు వైఫల్యాలు, సిరీస్ ఓటములు, ప్లేయర్ల ఫెయిల్యూర్‌తో ఫుల్ ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడట. మెల్‌బోర్న్ టెస్ట్ ముగియగానే డ్రెస్సింగ్ రూమ్‌లో మీటింగ్ పెట్టి సీనియర్లు అందర్నీ ఏకిపారేశాడట. టీమ్‌లో ఉండాలంటే తాను చెప్పినట్లు ఆడాలని.. తోకాడిస్తే బయటకు వెళ్లాలని వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. అయితే గౌతీ మాటలు ఎలా లీక్ అయ్యాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పఠాన్ ట్వీట్‌తో సెగలు!
బహుత్ హో గయా (ఇప్పటికే ఎక్కువైంది) అంటూ పంత్ సహా పలువురు సీనియర్లను గంభీర్ హెచ్చరించాడని వినిపిస్తోంది. అసలు గౌతీ ఏమన్నాడు? అనేది డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అవ్వాల్సిన అంశం. కానీ అది బయటకు ఎలా లీక్ అయింది? ఈ మాటల్ని లీక్ చేసిన ఇంటి దొంగ ఎవరు? ఆటగాళ్లు లేదా కోచింగ్ బృందంలో ఎవరీ తప్పు చేశారు? అనేది చర్చకు దారితీస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగినా అది అక్కడికే పరిమితం అవ్వాలి’ అని పఠాన్ ట్వీట్ చేశాడు. పఠాన్ లాంటి మాజీ ప్లేయర్ కామెంట్స్ చేయడంతో డ్రెస్సింగ్ రూమ్ గొడవ నిజమేననే అనుమానం మరింత బలపడుతోంది. దీంతో భారత జట్టులోని ఆ బ్లాక్ షీప్ ఎవరు? టీమ్ విషయాలు బయటపెట్టిన ఆ ఇంటి దొంగ ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.