IPL 2025: ఐపీఎల్‌లో అంచనాలకు అందని కొత్త సెంటిమెంట్.. అవార్డులంతా వాళ్లకే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:53 PM
IPL POTM Awards: క్రికెట్‌లో సెంటిమెంట్లకు కొదవే లేదు. గెలుపోటములు, రికార్డులు.. ఇలా అన్నింటా సెంటిమెంట్ల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇదే కోవలో తాజా ఐపీఎల్ సీజన్‌లో ఓ కొత్త సెంటిమెంట్ మీద డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దాని కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నేషనల్ మ్యాచుల్లోలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ దగ్గర నుంచి టాస్ వరకు చాలా విషయాల్లో సెంటిమెంట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని ప్లేయర్లు ఎంత వరకు నమ్ముతారు, ఆమోదిస్తారో తెలియదు గానీ అభిమానులు, క్రికెట్ లవర్స్ మాత్రం సెంటిమెంట్స్ గురించి విపరీతంగా డిస్కస్ చేస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఐపీఎల్‌కు సంబంధించి మరో కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. ఈ ఎడిషన్‌లో కొందరు ప్లేయర్లు ఈ సెంటిమెంట్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (పీవోటీఎం) అవార్డును కొల్లగొడుతుండటంతో దీని మీద చర్చలు ఊపందుకున్నాయి. అసలు ఏంటీ సెంటిమెంట్.. ఇందులో నిజమెంత.. అనేది ఇప్పుడు చూద్దాం..
డెబ్యూ సెంటిమెంట్
క్యాష్ రిచ్ లీగ్‌లో ఆటగాళ్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారడం కామనే. మినీ ఆక్షన్, మెగా ఆక్షన్‌ను బట్టి క్రేజ్ ఉన్న ప్లేయర్లు, స్టార్ ఆటగాళ్లు.. ఇలా రేంజ్ మారుతుందే గానీ కొందరు టీమ్స్‌ను అట్టిపెట్టుకుంటే, మరికొందరు ఇతర ఫ్రాంచైజీలకు వెళ్లిపోతారు. అయితే ఇలా టీమ్ మారిన క్రికెటర్లే ఈసారి ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎగరేసుకుపోతున్నారు. ఆర్సీబీ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్, సీఎస్‌కే స్పిన్నర్ నూర్ అహ్మద్, ఢిల్లీ క్యాపిటల్స్ పించ్ హిట్టర్ అశుతోష్ శర్మ, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ కోవలోకే వస్తారు.
ఆడిన తొలిసారే..
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన 5 మ్యాచుల్లో పైన పేర్కొన్న ఆటగాళ్లు పీవోటీఎం అవార్డుకు ఎంపికయ్యారు. అయితే వాళ్లంతా ఈ ఎడిషన్‌కు ముందు టీమ్స్ మారినవారే. కొత్త జట్టుకు డెబ్యూ చేస్తూ ఫస్ట్ మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. గత సీజన్‌లో లక్నోకు ఆడిన కృనాల్ పాండ్యా.. ఈసారి బెంగళూరు తరఫున ఆడుతూ తొలి మ్యాచ్‌లోనే పీవోటీఎం కొట్టేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. డీసీ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అశుతోష్, సీఎస్‌కేకు ఆడిన మొదటి ఆటలోనే నూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. లాస్ట్ సీజన్ కేకేఆర్‌కు ఆడిన అయ్యర్.. ఈసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే పీవోటీఎంకు ఎంపికయ్యాడు. దీంతో ఈ క్రేజీ సెంటిమెంట్ ఇంకెన్ని మ్యాచుల్లో రిపీట్ అవుతుందోనని అభిమానులు ఎగ్జయిటెడ్‌గా ఉన్నారు.
ఇవీ చదవండి:
రాజస్తాన్, కోల్‌కతాలో వీళ్లే డేంజరస్
రహానేకు అవమానం.. కెప్టెన్ అని చూడకుండా..
ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి