Virat Kohli: కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..
ABN , Publish Date - Jan 05 , 2025 | 05:47 PM
IND vs AUS: ఓటమి పరిపూర్ణమైంది. వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది. దీంతో టీమ్‌పై ఒక రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి.

ఓటమి పరిపూర్ణమైంది. వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది టీమిండియా. ఆస్ట్రేలియా చేతుల్లో మరోసారి ఓడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఒకదశలో 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న జట్టు.. చివరికి 1-3 తో సిరీస్‌ను కంగారూలకు అప్పగించింది. మన జట్టుకు ఈ గతి పట్టడానికి బ్యాటింగ్ ఫెయిల్యూరే మెయిన్ రీజన్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వరకు స్టార్లంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యంగా కోహ్లీ అయితే దారుణంగా విఫలమయ్యాడు. ప్రతిసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌కు వికెట్ పారేసుకుంటూ ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేశాడు.
సచిన్ కంటే తోపా?
బీజీటీలో కోహ్లీ వైఫల్యం కంటే కూడా అతడు ఔట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి మరీ వికెట్ పారేసుకున్నాడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 9 సార్లు అదే రీతిలో ఔట్ అయ్యాడు. ఫుట్ మూమెంట్, టెక్నిక్‌ను మెరుగుపర్చుకొని అందులో నుంచి బయటపడాల్సింది. కానీ ఆ పని చేయలేదు. కంగారూ బౌలర్లు ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేయడం, కోహ్లీ ఔట్ అవడం పరిపాటిగా మారింది. సిరీస్ మొత్తం మీద అతడి బ్యాట్ నుంచి వచ్చింది కేవలం 190 పరుగులే. జట్టు ఓటమికి ప్రధాన కారణాల్లో కింగ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఒకటి. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విరాట్‌పై విరుచుకుపడ్డాడు. కోహ్లీ కంటే యంగ్‌స్టర్స్ ఎంతో నయమని.. వాళ్లను తీసుకున్నా అదనంగా ఇంకొన్ని పరుగులు చేసేవారన్నాడు. విరాట్ సచిన్ కంటే తోపా? అని ప్రశ్నించాడు.
సూపర్‌స్టార్ కల్చర్‌కు నో!
‘భారత్‌కు సూపర్‌స్టార్ కల్చర్ అక్కర్లేదు. మనకు ఒక టీమ్ కల్చర్ కావాలి. కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నాళ్లు అవుతోంది? లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎంతగానో డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. కోహ్లీ ఆడని సమయంలో సచిన్ వెళ్లి దేశవాళీల్లో ఆడి వచ్చాడు. అతడు రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. తనకు అవసరం లేకపోయినా మాస్టర్ బ్లాస్టర్ వెళ్లి దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. పిచ్ మీద పాతుకుపోవడం, నాల్రోజుల పాటు ఫీల్డింగ్ చేయడం, సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరిగి బ్యాటింగ్‌కు రావడం.. ఇదంతా ప్రాక్టీస్, అలవాటు అవ్వాలని సచిన్ ఈ పని చేసేవాడు. కానీ కోహ్లీ ఆ పని చేయడం లేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే టెస్టుల్లో విరాట్ యావరేజ్ 30 కంటే తక్కువగా ఉంది. అలాంటి ఆటగాడు టీమ్‌లో ఉండటానికి అర్హుడా?’ అని పఠాన్ ప్రశ్నించాడు. కోహ్లీని అవమానించడం లేదని.. కానీ అతడు పదే పదే ఒకే తప్పు రిపీట్ చేస్తున్నాడని విమర్శించాడు. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు అందుబాటులో ఉన్నా.. వారిని కలసి టెక్నిక్ సరిదిద్దుకోవడం లాంటివి చేయడం లేదన్నాడు.