Rishabh Pant: ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్.. ఏం గుండె సామి
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:45 PM
IND vs AUS: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌ను ఎందుకు పిలుస్తారో ఇవాళ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. టెక్నిక్, టాలెంట్‌తో పాటు గుండె ధైర్యం ఉంటే తప్ప సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేమనే విషయం స్పష్టమైంది.
Sydney Test: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌ను ఎందుకు పిలుస్తారో ఇవాళ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. టెక్నిక్, టాలెంట్‌తో పాటు గుండె ధైర్యం ఉంటే తప్ప సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేమనే విషయం స్పష్టమైంది. వన్డేలు, టీ20ల్లో ఫ్లాట్ పిచ్‌ల మీద బ్యాటర్లు అలవోకగా ఫోర్లు, సిక్సులు కొడుతుంటే బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చూశాక మాత్రం క్రికెట్ లవర్స్ అభిప్రాయం తప్పక మారుతుందనే చెప్పాలి. భీకరమైన పేస్‌తో దూసుకొచ్చే బుల్లెట్ బంతులకు, స్వింగర్లకు ఒళ్లు హూనమై, గాయాలతో నిండిన సమయంలో బాల్‌ను టచ్ చేయాలన్నా భయపడే సిచ్యువేషన్ టెస్టు క్రికెట్ అంటే ఏంటో చూపించింది. ఈ పరిస్థితుల్లో భారత పించ్ హిట్టర్ పంత్ డిఫెన్స్ మోడ్‌లో ఆడిన ఫైటింగ్ నాక్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.
టార్గెట్ చేసి మరీ..
ఒకవైపు ఎక్స్‌పీరియెన్స్‌డ్ బౌలరైన మిచెల్ స్టార్క్, మరోవైపు కసి మీద ఉన్న బోలాండ్, ఇంకోవైపు మంచి ఊపు మీద ఉన్న ప్యాట్ కమిన్స్.. బౌన్స్, స్వింగ్, సీమ్, పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్. బౌండరీలు, సిక్సులు దేవుడెరుగు.. సింగిల్స్ తీయాలన్నా బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి. క్రీజులో నిలబడాలంటేనే బ్యాటర్లు భయపడే సిచ్యువేషన్. 72 పరుగులకే 4 మంది టాపార్డర్ బ్యాటర్లు ఔట్. అలాంటి టైమ్‌లో క్రీజులోకి వచ్చిన పంత్‌కు బౌన్సర్లతో స్వాగతం పలికారు ఆసీస్ పేసర్లు. ఒకదాన్ని మించి మరో రాకాసి బంతులతో అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక బంతి మోచేయి మీద, మరో బంతి హెల్మెట్‌కు, ఇంకో బంతి నేరుగా మణికట్టుపై.. ఇలా పంత్ బాడీని టార్గెట్ చేసి బౌలింగ్ చేసింది కంగారూ టీమ్. ఒంటి నిండా గాయాలు, భరించలేని నొప్పి. అయినా పంత్ గివప్ ఇవ్వలేదు. పట్టుదలతో క్రీజులో నిలబడి ఫైటింగ్ నాక్ ఆడాడు.
రియల్ చాంపియన్
నొప్పిని పంటి బిగువన అదిమిపెట్టి.. బ్యాటింగ్ కొనసాగించాడు పంత్. ఎలాంటి చాలెంజ్‌కు అయినా రెడీ అంటూ బ్యాట్‌తో గర్జించాడు. తన న్యాచురల్ గేమ్‌కు అపోజిట్‌గా ఆడాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. 98 బంతులు ఆడిన ఈ స్టార్ బ్యాటర్ 3 బౌండరీలు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా.. అందులో పంతే టాప్ స్కోరర్. అటాకింగ్ అప్రోచ్‌తో వికెట్ పారేసుకుంటున్నాడు, టీమ్ ఓడినా బుద్ధి రావట్లేదు అనే విమర్శల మధ్య క్రీజులోకి అడుగుపెట్టి.. గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు పంత్. సాలిడ్ డిఫెన్స్‌తో అతడు అడ్డుగోడలా నిలవడం, విలువైన పరుగులు చేయడం వల్లే టీమిండియా కనీసం ఆ స్కోరైనా చేసింది. అతడే నిలబడకపోతే జట్టు ఎప్పుడో ఆలౌట్ అయ్యేది. అతడు ఎన్ని విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడినా కష్టకాలంలో, గాయాలను ఓర్చుకొని, కఠిన పిచ్ మీద తోపు బౌలింగ్ అటాక్‌ను తట్టుకొని ఆడిన ఈ నాక్ మాత్రం ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అన్ని దెబ్బలు ఓర్చుకొని ఆడాడు.. ఏం గుండె సామి ఇది అని మెచ్చుకుంటున్నారు.
Also Read:
అశ్విన్ స్వార్థపరుడు
కుశాల్ మెరుపు శతకం
రోహిత్ లేకుండానే?
For More Sports And Telugu News