Rishabh Pant: గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:11 PM
Sydney Test: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది.
IND vs AUS: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది. ఫార్మాట్లకు అతీతంగా అద్భుతంగా ఆడుతూ టీమిండియాలో పర్మినెంట్ ప్లేయర్‌గా మారిన పంత్.. ఈ మధ్య టెస్టుల్లో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ తరుణంలో వేరే ఆప్షన్ లేక జట్టులో స్థానం పోతుందనే భయంతో కోచ్ గౌతం గంభీర్ మాట విన్నాడు. కానీ అది రివర్స్ కొట్టింది. గౌతీ మాట నమ్మి మోసపోయాడు పంత్. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
గంభీర్ వార్నింగ్‌తో..!
ప్రతి ప్లేయర్‌కు ఓ న్యాచురల్ గేమ్ ఉంటుంది. అలాగే పంత్‌కూ ఓ స్టైల్ ఉంది. అతడిది అటాకింగ్ అప్రోచ్. క్రీజులోకి దిగింది మొదలు ఉతుకుడే ఉతుకుడు అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగుతుంది. ఎదురుగా ఉన్నది ఎంతో తోపు బౌలర్ అయినా, ఫార్మాట్ ఏదైనా, కండీషన్స్ ఎలా ఉన్నా పంత్ హిట్టింగ్‌కే వెళ్తుంటాడు. ఈ రకమైన ఆటతీరుతోనే అతడు ఇన్నాళ్లూ సక్సెస్ అవుతూ వచ్చాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఇది బెడిసికొడుతోంది. క్రీజులో కుదురుకున్నాడు.. ఇక భారీ ఇన్నింగ్స్ ఖాయం అనుకుంటున్న తరుణంలో భారీ షాట్లకు వెళ్లి వికెట్ పారేసుకుంటున్నాడు పంత్. దీంతో అటాకింగ్ అప్రోచ్ మానుకో.. న్యాచురల్ గేమ్ పేరుతో అడ్డగోలుగా ఆడితే ఊరుకునేది లేదు.. ఇప్పటికే చాలా ఎక్కువైంది అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడట గంభీర్.
అసలుకే ఎసరు!
న్యాచురల్ గేమ్‌ను పక్కనబెట్టి ఇక మీదట టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడాలని పంత్‌ను గంభీర్ ఆదేశించాడని సమాచారం. అయితే గౌతీ అప్రోచ్ అసలుకే ఎసరులా తయారైంది. తన సహజ ఆటను కాదని.. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి డిఫెన్సివ్ మోడ్‌లో బ్యాటింగ్ చేశాడు పంత్. 98 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. అతడు ఆడింది మెమరబుల్ ఇన్నింగ్సే. కానీ పిచ్ ప్రవర్తిస్తున్న తీరు, అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతున్న విధానం, ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న దాన్ని బట్టి పంత్ అటాకింగ్‌కు వెళ్లి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అతడు బౌండరీలు, సిక్సులతో కంగారూ బౌలర్లను హడలెత్తించి ఉంటే ఆతిథ్య జట్టు డిఫెన్స్‌లో పడేదని చెబుతున్నారు. ఈ పిచ్ మీద అలా ఆడితేనే పరుగులు వస్తాయని.. అనవసరంగా గంభీర్‌ను నమ్మి పంత్ మోసపోయాడని, బిగ్ ఇన్నింగ్స్ ఆడాల్సినోడు తక్కువ స్కోరుకు వెనుదిరగాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. గౌతీ చెప్పినట్లు డిఫెన్స్ చేయడం వల్లే అతడి ఒంటి నిండా గాయాలు అయ్యాయని.. అదే బాల్ మెరిట్‌ను బట్టి బాదిపారెయ్ అని లైసెన్స్ ఇచ్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అంటున్నారు.