Gautam Gambhir: రోహిత్-కోహ్లీని బలిచేస్తున్నారు.. గంభీర్ తప్పులు కనిపించట్లేదా..
ABN , Publish Date - Jan 05 , 2025 | 07:06 PM
IND vs AUS: టీమిండియా రాత మారలేదు. మళ్లీ పరాజయమే మనల్ని పలకరించింది. ఓటమి పలకరించిందని అనడం కంటే మన జట్టే ఫెయిల్యూర్‌ను హగ్ చేసుకుందని అనాలేమో! అంత చెత్తగా ఆడింది టీమిండియా.
టీమిండియా రాత మారలేదు. మళ్లీ పరాజయమే మనల్ని పలకరించింది. ఓటమి పలకరించిందని అనడం కంటే మన జట్టే ఫెయిల్యూర్‌ను హగ్ చేసుకుందని అనాలేమో! అంత చెత్తగా ఆడింది టీమిండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-0తో గొప్పగా ఆరంభించిన మెన్ ఇన్ బ్లూ.. ఆఖరుకు వచ్చేసరికి 1-3తో ట్రోఫీని ఆస్ట్రేలియాకు అప్పగించింది. సిరీస్ ఆరంభంలో అన్నింటా బలంగా కనిపించిన జట్టు కాస్తా ఒక్కో మ్యాచ్ గడుస్తున్న కొద్దీ తేలిపోవడం స్టార్ట్ అయింది. బ్యాటింగ్‌లో దారుణమైన వైఫల్యంతో అవమానకర ఓటములు కొనితెచ్చుకుంది. దీంతో భారత్‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పించుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నాడు.
బాధ్యత తీసుకోవాల్సిందే!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు చెత్తాటతో తీవ్రంగా నిరాశపర్చారని అన్నాడు గవాస్కర్. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం కొలాప్స్ జట్టును అగాథంలోకి నెట్టేసిందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్ టీమ్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నాడు. అయితే ఈ ఓటములకు ప్లేయర్లను మాత్రమే బద్నాం చేయడం సరికాదన్నాడు. దీనికి భారత టీమ్ మేనేజ్‌మెంట్, గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ కూడా బాధ్యత తీసుకోవాలని చురకలు అంటించాడు. బ్యాటర్లు వరుసబెట్టి ఫెయిల్ అవుతుంటే కోచ్‌లు ఏం చేస్తున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్ కోచ్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని దుయ్యబట్టాడు.
కోచ్‌ల తప్పు లేదా?
‘గత కొన్ని మ్యాచుల నుంచి టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో టెస్టులో 45 పరుగులకే జట్టు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా తడబడుతూ వచ్చింది. మన టీమ్ బ్యాటింగ్‌లో దమ్ము లేదు. అందుకే బ్యాటింగ్ కోచ్‌ను ప్రశ్నించాల్సిన టైమ్ వచ్చింది. భారత బ్యాటర్లలో ఇంప్రూవ్‌మెంట్ ఎందుకు కనిపించడం లేదు? బ్యాటర్లు పదే పదే ఫెయిల్ అవుతుంటే కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నట్లు? వాళ్ల తప్పుల్ని, టెక్నిక్‌ను సరిదిద్దాలి కదా? రాబోయే సిరీస్‌ల్లో ఏయే ఆటగాళ్లను తీసేయాలనే చర్చతో పాటు కోచింగ్ స్టాఫ్‌లో ఎవర్ని తొలగించాలో కూడా ఆలోచించడం మంచిది’ అని గవాస్కర్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కల్లా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం బెటర్ అని పేర్కొన్నాడు. త్రో డౌన్స్‌తో బ్యాటర్లు మెరుగవ్వరని.. టెక్నిక్‌ను ఇంప్రూవ్ చేస్తే తప్ప రిజల్ట్ మారదన్నాడు.