Share News

Virat Kohli: ఆ దేశానికి వెళ్లను.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:24 AM

Virat Kohli On Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదంటూ ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేయగా.. తాజాగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా...

Virat Kohli: ఆ దేశానికి వెళ్లను.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli

వీడ్కోలు వార్తలపై విరాట్‌ కోహ్లీ

బెంగళూరు: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదంటూ ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేయగా.. తాజాగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా తన రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించాడు. ఆట నుంచి వైదొలగాలని తాను అనుకోవడం లేదని.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన స్పోర్ట్స్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా విరాట్‌ వెల్లడించాడు. ‘కంగారు పడకండి. నేనెలాంటి ప్రకటనలు చేయడం లేదు. రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచనా చేయలేదు. ప్రస్తుతానికైతే అంతా బాగుంది. క్రికెట్‌ ఆడడాన్ని నేనింకా ఆస్వాదిస్తున్నా’ అని 36 ఏళ్ల కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే, ఆ మధ్య ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీనే ఆస్ట్రేలియాలో తన చివరి పర్యటనగా భావిస్తున్నానని ఈ సందర్భంగా విరాట్‌ తెలిపాడు. ‘నాలో మరో ఆసీస్‌ పర్యటన మిగిలి ఉండకపోవచ్చు. అందుకే గడచిన జ్ఞాపకాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటా. కెరీర్‌కు వీడ్కోలు పలికాక ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఈ మధ్య సహచరులు కొందరిని రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ గురించి అడితే.. వారి నుంచి కూడా ఇదే సమాధానం. బహుశా పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తానేమో’ అని విరాట్‌ అన్నాడు.


రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటా!

ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. ఒకవేళ భారత జట్టు 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో గనక ఫైనల్‌ చేరితే, రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటా అని సరదాగా అన్నాడు. ‘ఆ విశ్వక్రీడల్లో టీమిండియా ఫైనల్‌ చేరితే, ఆ ఒక్క మ్యాచ్‌ ఆడేందుకైనా టీ20ల్లో రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటా. ఒలింపిక్స్‌లో పతకం గెలవడమంటే అద్భుతమే కదా’ అని విరాట్‌ చమత్కరించాడు.


ఇవీ చదవండి:

మనసు మార్చుకున్న రోహిత్

ముంబై అ‘ద్వితీయం’

నితీశ్‌కు లైన్‌క్లియర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2025 | 01:29 PM

News Hub