Share News

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:38 AM

ఏళ్లుగా వన్నె తరగని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌కు నేడు తెర లేవనుంది. దాదాపు రెండు నెలలపాటు ఉర్రూతలూగించే ఈ లీగ్‌ మే 25న ఫైనల్‌తో ముగుస్తుంది.

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్

  • వేసవిలో మస్తు మజా!

  • ఈసారి కొత్త కొత్తగా.. ఐదు జట్లకు నూతన కెప్టెన్లు

  • మారిన ఆటగాళ్లు,నిబంధనలు

మండు వేసవిలో భానుడి భగభగలతో అలసిపోయే అభిమానులు..ఆటగాళ్ల విన్యాసాలతో హాయిగా సేద తీరే సమయం వచ్చేసింది. టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ విజయ సంబరాలు ఇంకా సద్దుమణగక ముందే.. క్రికెట్‌ ప్రేమికులకు మరింత హుషారునిస్తూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ దూసుకొచ్చింది. ప్రపంచ క్రికెట్‌ను సమ్మోహితం చేసే ఈ మెగా లీగ్‌ నేడే మొదలవనుంది.

కొత్త కెప్టెన్లు, మారిన ఆటగాళ్లు, నిబంధనలు.. ఇలాంటి అంశాలతో ఈసారి లీగ్‌ సరికొత్తగా ముస్తాబై మన ముందుకొచ్చింది. భారీ వేలంలో స్టార్‌ ఆటగాళ్లు ఫ్రాంచైజీలను మార్చగా, కొందరు కెప్టెన్లు పాత జట్లకు వీడ్కోలు పలికారు. చాంపియన్స్‌ ట్రోఫీలో కలిసికట్టుగా కదం తొక్కిన మన క్రికెటర్లు, ఇప్పుడు విడివిడిగా పోటీ పడనున్నారు. అయితేనేం.. బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్ల మెరుపులతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగే ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు అభిమానులంతా సిద్ధం కండి!

కోల్‌కతా: ఏళ్లుగా వన్నె తరగని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌కు నేడు తెర లేవనుంది. దాదాపు రెండు నెలలపాటు ఉర్రూతలూగించే ఈ లీగ్‌ మే 25న ఫైనల్‌తో ముగుస్తుంది. పది జట్లు మొత్తంగా 74 మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. శనివారం నాటి ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఐపీఎల్‌ అభిమానులకు కాస్త విభిన్నంగా కనిపించనుంది. ఎందుకంటే.. కొన్నేళ్లుగా అలవాటు పడిన జట్లకు కాకుండా వేలం కారణంగా చాలా మంది ఇతర ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న నిబంధనలకు తోడు మరికొన్నింటిని జత చేశారు. ముఖ్యంగా ఈ సీజన్‌ నుంచి బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పేసర్లు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంపైర్ల అంగీకారంతో బంతిని మార్చే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఎత్తు వైడ్లు, ఆఫ్‌స్టంప్‌ ఆవల వైడ్లను తేల్చేందుకు డీఆర్‌ఎ్‌సను వినియోగించనున్నారు. ఈ మార్పులన్నీ కూడా మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చేవే.


ధోనీకిదే ఆఖరా?

గత రెండేళ్లుగా ఐపీఎల్‌ ఆరంభమైనప్పుడల్లా సీఎ్‌సకే మూలస్తంభం ఎంఎస్‌ ధోనీకిదే చివరిదా? అనే సందేహం పరిపాటిగా మారింది. 43 ఏళ్ల ఈ వెటరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండడంతో దేశంలోని ఏ స్టేడియానికి వెళ్లినా అతడి కోసం ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. జట్టులో ధోనీ ఉండడం అటు సీఎ్‌సకేకు కూడా కొండంత బలంగా మారింది. క్రికెట్‌పై అతడికున్న అవగాహన, తిరుగులేని వ్యూహాలు, ఫీల్డింగ్‌ మార్పులు, మెరుపు ఆటతో మ్యాచ్‌ను ముగించే తీరు ధోనీని విలువైన ఆటగాడిగా మార్చాయి. ఇప్పటికీ అద్భుత ఫిట్‌నె్‌సతో కనిపిస్తున్న ఈ చెన్నై ‘తలా’ తాజా సీజన్‌తో ఐపీఎల్‌ను ముగించవచ్చని బలంగా విశ్వసిస్తున్నారు.

Untitled-6 copy.jpg


టీ20 బరిలోకి రో-కో

గతేడాది టీ20 ప్రపంచకప్‌ విజయంతో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత మళ్లీ ధనాధన్‌ పోరు కోసం ఈ జోడీ బరిలోకి దిగనుండడం ఇదే మొదటిసారి. అందుకే అందరి దృష్టి వీరిపైనే ఉంది. 2024 సీజన్‌లో కోహ్లీ 741 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే రోహిత్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఈసారి తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో విరుచుకుపడి ముంబైకి అండగా నిలవాలనుకుంటున్నాడు. బహుశా హిట్‌మ్యాన్‌కు కూడా ఇదే చివరి ఐపీఎల్‌ కావచ్చనే భావనలో ఉన్నారు.

Untitled-6 copy.jpg


లఖ్‌నవూ తరఫున శార్దూల్‌!

వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ లఖ్‌నవూ తరఫున బరిలోకి దిగనున్నాడు. గాయపడిన పేసర్‌ మొహిసిన్‌ ఖాన్‌ స్థానంలో అతడిని తీసుకున్నారు. అయితే ఇప్పటికే జట్టు సన్నాహకాల్లో పాల్గొంటున్నప్పటికీ లఖ్‌నవూ జట్టు శార్దూల్‌ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత వేలంలో చెన్నై జట్టు అతడిని రిటైన్‌ చేసుకోలేదు. అయితే దేశవాళీల్లో శార్దూల్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన విషయం తెలిసిందే.

Untitled-6 copy.jpg


వరుణుడితో ఇబ్బందే..

అభిమానుల సందడి ఎలా ఉన్నా వారి ఉత్సాహంపై వరుణుడు నీళ్లుజల్లే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కోల్‌కతా రీజియన్‌లో ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేయడమే ఇందుకు కారణం. దీంతో శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఆరంభ మ్యాచ్‌ను ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. శుక్రవారం కూడా ఇరు జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌ను పూర్తి చేయలేకపోయాయి. అలాగే టాస్‌కు ముందు జరిగే ఆరంభ వేడుకలపైనా వర్షం ప్రభావం చూపనుంది. ఇక లీగ్‌ దశలో మ్యాచ్‌లకు అదనంగా గంటపాటు సమయం కేటాయిస్తారు. దీంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌ అర్ధరాత్రి 12 గంటల్లోపు ముగియాలి. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌ రద్దయితే చెరో పాయింట్‌ను ఇస్తారు.

Untitled-6 copy.jpg


కెప్టెన్ల మార్పుతో రాత మారేనా?

ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్‌లో తొమ్మిది జట్లకు స్వదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండబోతున్నారు. ఒక్క సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మాత్రమే విదేశీ కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ కొనసాగుతున్నాడు. మరోవైపు ఐదు జట్లను కొత్త కెప్టెన్లు నడిపించబోతున్నారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నప్పటికీ ఆర్‌సీబీ రజత్‌ పటీదార్‌ను తమ నాయకుడిగా ఎంచుకుంది. తను ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. అలాగే రాహుల్‌ అనాసక్తితో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథ్య బాధ్యతలను స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ తీసుకున్నాడు. చివరి సీజన్‌లో కేకేఆర్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌.. ఈసారి తన జట్టు పంజాబ్‌ కింగ్స్‌ పవరేంటో చూపాలనుకుంటున్నాడు. మరోవైపు డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా పగ్గాలు అనూహ్యంగా అజింక్యా రహానెకు దక్కాయి. ఢిల్లీకి దూరమైన రిషభ్‌ పంత్‌.. సారథిగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రాత మార్చాలని పట్టుదలగా ఉన్నాడు. ఇక, తమ ఆరంభ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు రియాన్‌ పరాగ్‌, ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్‌ నేతృత్వం వహిస్తుండడం విశేషం.

Untitled-6 copy.jpg

Updated Date - Mar 22 , 2025 | 03:42 AM