Share News

Rajeev Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవల్లేవ్‌!

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:40 AM

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సర్కారుకు షాక్‌ ఇచ్చాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపివేశాయి. ఎమర్జెన్సీ సేవలను మాత్రం అందిస్తూ మిగిలిన అన్ని రకాల సేవలను అందించలేమని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

Rajeev Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవల్లేవ్‌!

  • సర్కారుకు షాకిచ్చిన ప్రైవేటు ఆస్పతులు

  • పెండింగ్‌ బకాయిలపై స్పష్టత రాలేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ఫ్లెక్సీలు

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సర్కారుకు షాక్‌ ఇచ్చాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపివేశాయి. ఎమర్జెన్సీ సేవలను మాత్రం అందిస్తూ మిగిలిన అన్ని రకాల సేవలను అందించలేమని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. తమ ఆస్పత్రుల ప్రాంగణాల్లో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. గత ఏడాది మార్చి నుంచి ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ నుంచి బకాయులు రావడం లేదని, ఇన్ని రోజులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు పేర్కొన్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని, అందుకే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ నెల 10 నుంచి సేవలను నిలిపివేస్తున్నట్లు 4 రోజులు ముందుగానే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు మెయిల్‌ పంపాయి. దాంతో 9న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధుల బృందంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఇవో చర్చలు జరిపారు.


అదేరోజు ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌ బిల్లులకు సంబంధించి సుమారు రూ.120 కోట్లు బకాయిలను విడుదల చేసింది. చర్చల సందర్భంలో ఈ నెలాఖరు నాటికి మరో రూ.100 కోట్లు చెల్లించాలని ఆస్పత్రులు డిమాండ్‌ చేశాయి. సర్కారు మాత్రం ఫిబ్రవరి చివరిలోగా చెల్లిస్తామని తెలిపింది. చర్చల సందర్భంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు తొలుత సేవలను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. దీంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు సమ్మె విరవిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కానీ కొద్ది గంటల్లోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ పథకాలకు 10 నెలల నుంచి నిధులు ఇవ్వడం లేదని ప్రకటన విడుదల చేసింది. సర్కారు చెల్లించిన రూ.120 కోట్లు కేవలం నెలన్నర బిల్లులేనని పేర్కొంది. 10 నెలల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని తెలిపింది. దీనిపై సరైన హామీ లేకపోవడం వల్లనే సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌వెల్లడించారు.


బాగానే ఇస్తున్నామంటోన్న వైద్యశాఖ

ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏటా సగటున వెయ్యి కోట్లకు చొప్పున నిధులు వెచ్చించాల్సి ఉండగా.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు 50ు చొప్పున కేటాయించింది. 2015లో రూ.444 కోట్లు, 2016లో రూ.609 కోట్లు, 2017లో రూ.524 కోట్లు, 2018లో రూ.596 కోట్లు, 2020లో రూ.557 కోట్లు, 2021లో రూ.783 కోట్లు, 2022లో రూ.631 కోట్లు, 2023లో రూ.515 కోట్లు చెల్లించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024లో రూ.1130 కోట్లను విడుదల చేసింది. అయితే గతంలో సగం బిల్లులే ఇచ్చినప్పటికీ.. నాటి సర్కారుపై నెట్‌వర్క్‌ ఆస్పత్రు లు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భం లేదని వైద్య శాఖ అఽధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 04:40 AM