Share News

ఆగని ఇసుక అక్రమ రవాణా...

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:29 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఆగని ఇసుక అక్రమ రవాణా...

మంచిర్యాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అదికూడా ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనిచోట గోదావరి నుంచి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా తరలిసు ్తన్నారు. ఫిర్యాదులు అందిన సందర్భంలో తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ పనుల పేరుతో...

జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరమైన అభివృద్ధి పనులు కావడంతో నిర్మాణానికి అవసరమైన ఇసుకను గోదావరి నుంచి వినియోగించు కునే వెసులుబాటును ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రులు కల్పించారు. ఇసుకను తరలించే బాధ్యతను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. గోదావరిలో తవ్వుతున్న ఇసుకను సదరు కాంట్రాక్టర్‌ శ్మశాన వాటిక పనులకు వినియోగించాల్సి ఉండగా, రాత్రి వేళల్లో ప్రైవేటు మార్కెట్‌లో అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం రాత్రి టిప్పర్ల ద్వారా తరలించిన ఇసుకను పాత మంచిర్యాలలోని పార్క్‌ సమీపంలో నిల్వ చేశారు. ఆ ఇసుకలో పాత దుప్పట్లు, వస్త్రాలు ఉండటంతో గోదావరిలోని పుష్కరఘాట్‌ సమీపంలో నుంచి తరలిం చారని పలువురు ట్రాక్టర్‌ యజమానులు చెబుతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను గురువారం ఉదయం పలువురు ట్రాక్టర్‌ యజమానులు పరిశీలిం చారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక సుమారు 70 ట్రాక్టర్ల వరకు ఉంటుందని, అక్రమార్కుల కారణంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన రీచ్‌లో తమ ట్రాక్టర్లకు బుకింగ్‌లు దొరకడం లేదని వాపోయారు. అక్రమ ఇసుక నిల్వలపై మైనింగ్‌శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెలవెలబోతున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌....

ప్రజల అవసరాల నిమిత్తం ఇసుకను అధికారికంగా తరలించేందుకు హాజీపూర్‌ మండలం ముల్కల్ల వద్ద గోదావరిలో ప్రభుత్వపరంగా నవంబరు 16న రీచ్‌ ఏర్పాటు చేశారు. ఇసుక రీచ్‌ను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, మైనింగ్‌ ఏడీ జగన్మోహన్‌ రెడ్డిలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ట్రాక్టర్ల ద్వారా రీచ్‌ నుంచి ఇసుకను చేరవేస్తున్నారు. ప్రారంభంలో బుకింగ్‌లు బాగానే ఉన్నా.... క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నవంబరులో 8800 ట్రిప్పులకు బుకింగ్‌లు ఇవ్వగా 35,200 మెట్రిక్‌ టన్నుల ఇసుకను తరలించారు. డిసెంబర్‌లో 11,357 ట్రిప్పుల ద్వారా 45,400 మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందించారు. నవంబరులో కేవలం 15 రోజుల వ్యవధిలో 35,200 మెట్రిక్‌ టన్నులకు ఆన్‌ లైన్‌ బుకింగ్‌ ఇవ్వగా, డిసెంబర్‌ నెల మొత్తానికి 45,400 మెట్రిక్‌ టన్నులే ఇచ్చారు. దాదాపు ఎనభై వేల మెట్రిక్‌ టన్నులు బుక్‌ చేయాల్సి ఉండగా, అందులో సగం మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేశారు. గోదావరి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పెద్ద మొత్తంలో ఇసుక తరలిపోతున్నందునే అధికారిక రీచ్‌లో బుకింగ్‌లు ఉండటం లేదని ట్రాక్టర్‌ యజమానులు ఆవేదన చెందుతున్నారు.

కిస్తులు కట్టలేని పరిస్థితుల్లో యజమానులు...

ముల్కల్ల వద్ద అధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌పై ఆధారపడి సుమారు 900 మంది ట్రాక్టర్‌ యజమానులు ఉన్నారు. ఇక్కడి ఇసుకను మంచిర్యాల తోపాటు నస్పూర్‌, మందమర్రి, హాజీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లికి చెందిన ట్రాక్టర్లు తరలిస్తాయి. అధికార రీచ్‌ నుంచి బుకింగ్‌లు లేని కారణంగా ఫైనాన్స్‌ల్లో ట్రాక్టర్ల నెలవారీ కిస్తులు చెల్లించలేని పరిస్థితుల్లో యజమా నులు ఉన్నారు. ఆన్‌లెన్‌ బుకింగ్‌ ద్వారా రీచ్‌ నుంచి తరలించే ఇసుక ట్రిప్పుపై ఒక్కోదానికి రూ.1050 యజ మానులకు వెళ్తుంది. ఒక్కో ట్రిప్పును తరలించడానికి లేబర్‌ చార్జీ రూ.300, డీజిల్‌ రూ.300, డ్రైవర్‌ వేతనం రూ.200, కూలీలకు టిఫిన్స్‌, టీలు మరో రూ.200 వరకు ఖర్చులు ఉంటాయని యజమానులు చెబుతున్నారు. ఇవి పోను నెలవారీ ట్రాక్టర్‌ కిస్తు కింద కనీసం రూ.15 వేలు, సంవత్సరానికి ఇన్సూరెన్స్‌ రూ. 14వేలు, మూడు నెలకోసారి టాక్స్‌ రూ.1050 ఉంటుందని పేర్కొంటు న్నారు. 900 ట్రాక్టర్ల ద్వారా రీచ్‌ నుంచి నెలలో సగటున 11,500 ట్రిప్పులు చేరవేస్తే మూడు రోజులకు ఒకసారి అవకాశం వస్తుందని, దీంతో నిర్వహణ భారమవు తుందని ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికా రులు ఇసుక అక్రమ రవాణాను నిలవరించగలిగితే పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయని ట్రాక్టర్‌ యజ మానులు చెబుతున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:29 PM