జోరుగా కోడి పందేలు...
ABN , Publish Date - Jan 13 , 2025 | 10:54 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.
మంచిర్యాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. అయితే కోళ్ల పందేల స్థావరాలపై రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు దృష్టి సారించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెట్టింగులు సాగుతున్నాయన్న నిర్ధారణకు వచ్చిన అధికారులు దాడులు జరుపుతున్నారు.
విస్తరిస్తున్న కోడి పందేలు....
జిల్లాలో కోడి పందేల జోరు క్రమంగా విస్తరిస్తోంది. నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలం నాగంపేట, బొప్పారం, కన్నెపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాల్లో కోడి పందేల స్థావరాలు ఉండగా పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నట్లు తెలుస్తోంది. స్థావరాల వద్ద విందులు చేసుకుంటున్న పందెం రాయుళ్లు బెట్టింగులు కాస్తున్నట్లు సమాచారం. లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న కోటపల్లి మండలంలో జరిగిన పోలీసు దాడుల్లో ఏడుగురు పందెం రాయుళ్లు పట్టుపడగా, 10 కోళ్లు, మొబైల్ ఫోన్లు, రూ.59వేల పై చిలుకు నగదు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పందెం కోళ్లకు వేలల్లో గిరాకీ....
సంక్రాంతి పండుగ సందర్భంగా పందెం కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేక ఆహార పదార్థాలతో పెంచుతున్న కోళ్ల పెంపకం దారులు ఒక్కో పుంజుకు రూ.3 వేల నుంచి 10వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగులు పెద్ద మొత్తంలో జరుగుతుండగా ఆ మేరకు కోళ్లపై పెట్టుబడి పెట్టేందుకు పందెం రాయుళ్లు వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది.
పోలీసుల ఉక్కుపాదం....
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోడి పందేల స్థావరాలపై టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు దాడులు జరుపుతున్నారు. కోటపల్లి మండలంలోని ప్రాణహిత సరిహద్దు గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగుతుండగా, స్థావరాలపై పోలీసులు దాడులతో వెలుగులోకి వచ్చాయి. ప్రాణహిత తీరం వెంట తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన వ్యక్తులు ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుని పందెం కాస్తున్నట్లు సమాచారం. భీమారం మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులను గతంలో కోడి పందాలు ఆడిన సంఘటనలో పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కోడి పందెం స్థావరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థావరాలపై దాడులు నిర్వహించడంతోపాటు పాత నేరస్థులను బైండోవర్ చేయడం ద్వారా కోడి పందాలను నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి పందెం రాయుళ్లు తమ పనిని కానిస్తున్నారు.
కోడి పందేలు నేరం
....మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
సంక్రాంతి పండుగ పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదిలేదు. కోళ్ల పందాలు ఆడటం చట్ట విరుద్ధం. పందేలు కాసే వారు జైలుకు వెళ్లక తప్పదు. పందెం రాయుళ్ల ఆటకట్టించేందుకు ప్రత్యేక పోలీసు పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదు. పాత నేరస్థులను ముందస్తు బైండోవర్ చేయడం ద్వారా కోడి పందాలను నివారించే చర్యలు చేపడుతున్నాం.