Share News

కార్పొరేషన్‌గా మంచిర్యాల

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:03 PM

మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కార్పొరేషన్‌గా మంచిర్యాల

మంచిర్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్‌ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల కేంద్రంగా కార్పొరేషన్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మూడు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన సీడీఎంఏ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అవసరమైన పూర్తి వివరాలు పంపాలని ఆదేశిస్తూ క్రితం మున్సిపల్‌ అధికారులకు లేఖ రాసింది. ఈ మేరకు రెండు మున్సిపాలిటీలు, ఆరు గ్రామాల్లో జనాభా, ఓటర్లు, కుటుంబాలు, ఆదాయ వనరులు, తదితర అంశాలపై అధికారులు సర్వే ప్రారంభించారు. సర్వే నివేదిక ప్రభుత్వానికి అందడంతో కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదల చేసింది.

జనాభా ప్రాతిపదికన....

జనాభా ప్రాతిపదికన మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నస్పూర్‌ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్‌ మండలం లోని వేంపల్లి, కొత్తపల్లి, పోచంపాడ్‌, ముల్కల్ల, గుడి పేట, చందనాపూర్‌, నర్సింగాపూర్‌, నంనూర్‌ గ్రామాల ను విలీనం చేస్తూ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు గెజిట్‌లో పేర్కొంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటే జీవో నెంబర్‌ 571 ప్రకారం 2.5 నుంచి 3 లక్షల జనాభా అవసరం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం అటుఇటుగా ఉన్నా కార్పొరేషన్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు జీవో చెబుతోంది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డు లకుగాను 87,153 మంది జనాభా ఉండగా, నస్పూర్‌లో మున్సిపాలిటీలో 25 వార్డులకు 76,641, అయితే 2021లో అధికారుల గణాంకాల ప్రకారం మంచిర్యాల మున్సిపాలి టీలో లక్షా 50వేలు, నస్పూర్‌లో 91,427, జనాభా ఉంది. అలాగే విలీన గ్రామాల్లో కనీసం 13వేల జనాభా వరకు ఉంటుందని అంచనా. 2022 ప్రకారం చూస్తే రెండు మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో మొత్తం జనాభా 2,54,000 మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో ఆయా స్థానిక సంస్థల పరిధిలో మరింతగా జనాభా పెరగడం, 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండటంతో మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక స్థానం...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మంచిర్యాల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రధాన రైల్వే మార్గం అందుబాటులో ఉంది. మొదటి సారిగా 1956లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. 2016లో మంచిర్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత మరింతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 36 వార్డులతో ఉన్న మంచిర్యాల విద్య, వైద్య సదుపాయాలకు నిలయంగా ఉంది.మంచిర్యాల చుట్టు పక్కల బొగ్గు బావులు, సిరామిక్‌ ఇండస్ట్రీలతోపాటు, విద్యుత్‌ పరిశ్రమలు ఉన్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరుంది. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించనుండటంతో మరింత అభివృద్ధి దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచే మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయగా ఎట్టకేలకు మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు కాబోతోంది.

Updated Date - Jan 18 , 2025 | 11:03 PM