ఎఫ్ఎస్టీ ప్లాంట్లకు మోక్షమెప్పుడో...!
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:15 PM
మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.
మంచిర్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాత మున్సిపాలిటీలను ఇందుకు ఎంపిక చేశారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఒక్కొక్క ఎఫ్ఎస్టీ ప్లాంట్‌ను సుమారు రూ. 4 కోట్లతో ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన ఎకరం స్థలాన్ని కూడా ఆయా మున్సిపాలి టీలు కాంట్రాక్టర్లకు అప్పగించగా అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తయి పనులు చేపట్టే ముందు అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ పూర్తయిన తరువాత మూడు నెలల వ్యవధిలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్లాంట్ ప్రారంభమైన నాటి నుంచి 30 సంవత్సరాల వరకు సదరు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. మానవ వ్యర్థాలను బయట పడేయం ద్వారా వాతావరణం కలు షితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుండటంతో అప్పటి ప్రభుత్వం ఎఫ్ఎస్టీపీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు దోహదం
నివాస గృహాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి మున్సిపాలిటీల ద్వారా లైసెన్సు పొందిన స్లడ్జింగ్ ఆపరే టర్లు మురికిని సేకరించి నేరుగా ఎఫ్ఎస్టీపీలకు తరలిస్తారు. అక్కడ దాన్ని బ్యాంకర్‌లో డంప్ చేసిన తరు వాత ఎరువుగా మారుస్తారు. ఇలా తయారు చేసిన ఎరువును తొలుత మున్సిపాలిటీల పరిధిలోని మొక్క లకు ఉపయోగిస్తారు. పంట పొలాలకు, చేలకు అవసర మైన రైతులు ఎరువును కొనుగోలు చేసి వినియో గిస్తారు. సాధారణంగా ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులు నిండగానే పైవ్రేటు ఆపరేటర్లు దాన్ని సేకరించి బహి రంగ ప్రదేశాల్లో డంప్ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం మూలంగా వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. చెరువులు, కుంటలు, కాలువలు, నదులు, వాగుల పక్కన పడవేస్తే నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెప్టిక్ ట్యాంకుల నుంచి మురికి సేకరించేందుకు ఆపరేటర్లకు మున్సిపాలిటీ లైసె న్సులు మంజూరు చేశాయి. మంచిర్యాల మున్సిపాలిలో నలుగురు, బెల్లంపల్లిలో ఇద్దరు చొప్పున ఆపరేటర్లను ఎంపిక చేసిన అధికారులు వారికి లైసెన్సులు సైతం మంజూరు చేశారు. లైసెన్సులు మంజూరైనందున ఇకపై ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకుల నుంచి కేవలం లైసెన్సు పొందిన ఆపరేటర్లు మాత్రమే మురికిని సేకరించవలసి ఉంటుందని, ఇతరులు సేకరించడం, బహిరంగ ప్రదే శాల్లో డంప్ చేయడం నిషేధించినట్లు ప్రకటించారు.
అభ్యంతరాల వెల్లువ
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయికుంటలో ఎఫ్ఎస్టీపీ కోసం అధికారులు స్థలం కేటాయించారు. స్థలం నివాస గృహాలకు దగ్గరగా ఉండటంతో ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస గృహాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ప్లాంటు నిర్మాణానికి స్థలం కేటాయించడంతో భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణశాఖ నిబంధనల మేరకు నివాస గృహాలకు కనీసం 200 మీటర్ల దూరం ఉండాలని, మరో చోట ప్లాంటు నిర్మాణం చేపట్టాలని స్థానికులు అప్పటి కలెక్టర్ భారతి హోళికేరి, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు.
నిబంధనలు ఇలా.....
ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేసే స్థలం విషయంలో పర్యావరణ శాఖ నిబంధనలు విధించింది. నివాస గృహాలు, మతపరమైన స్థలాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, నీటి ప్రదేశాలు, పార్కులు, రోడ్లకు నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారికి 100 మీటర్లు, రాష్ట్ర రహదారికి 50 మీటర్లు అంతర్గత రోడ్ల నుంచి 25 మీటర్లు, నదుల నుంచి 100 మీటర్లు, చెరువులు, కొలనుల నుంచి 200 మీటర్లు, నివాస గృహాలు, పార్కులు, మంచినీటి బావులు, హైవేలకు 200 మీటర్ల దూరంలో ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు స్థలం కేటాయించాల్సి ఉంటుంది. అయితే సాయికుంటలో నివాస గృహాల నుంచి కేవలం 100 మీటర్ల లోపు స్థలం కేటాయించడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు.
అండాళమ్మ కాలనీలో స్థల పరిశీలన
ఎఫ్ఎస్టీ ప్లాంట్ ఏర్పాటుకు అండాళమ్మ కాలనీలో స్థల పరిశీలన జరిపారు. అక్కడ కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో మరోచోట స్థలం ఎంపికకు ఇప్పటికీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అండాళమ్మ కాలనీలో ఇప్పటికే డంప్ యార్డు ఉండటంతో అక్కడి ప్రజలు ఎఫ్ఎస్టీపీ ఏర్పాటుకు అంగీకరించడం లేదు. అయితే ఎఫ్ఎస్టీ ప్లాంట్ల వల్ల లాభాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని చెబుతున్నారు. ప్లాంట్ల కారణంగా దుర్వాసన ఉండదని, ఆ ప్రాంతంలో విరివిగా మొక్కలు పెంచడం వల్ల ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే పట్టణానికి దూరంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నందున ఎఫ్ఎస్టీ ప్లాంట్‌ను అక్కడ నిర్మిస్తే ఎలాంటి అభ్యంత రాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ విషయమై దృష్టిసారించి, ఆమోదయోగ్యమైన చోట స్థలాలు ఎంపిక చేయడంతో పాటు త్వరితగతిన ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.