Share News

AIG : ఏఐజీలో రూ.400 కోట్లతో ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:50 AM

క్యాన్సర్‌ రోగులకు ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి సిద్ధమవుతోంది.

AIG : ఏఐజీలో రూ.400 కోట్లతో ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ

  • క్యాన్సర్‌ రోగులకు అత్యాధునిక చికిత్స

  • త్వరలో అందుబాటులోకి

  • కణితిని కచ్చితంగా గుర్తించి దానికే చికిత్స

  • రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశం

  • ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ రోగులకు ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి సిద్ధమవుతోంది. ఇందు కోసం రూ.400 కోట్ల వ్యయంతో డైనమిక్‌ ఏఆర్‌సీ సహా అత్యాధునిక ప్రోటోస్‌ వన్‌-ప్రోటాన్‌ థెరపీ సిస్టమ్‌ను దిగుమతి చేసుకునేందుకు బెల్జియంకు చెందిన ఐబీఏ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. రూ.800 కోట్ల వ్యయంతో 300 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అంకాలజీ విభాగంలో ఈ ప్రోటాన్‌ బీమ్‌ థెరపీని అందుబాటులోకి తెస్తామని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ప్రకటించారు.


ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ అందుబాటులోకి వస్తే ఈ విధానంలో చికిత్స అందించే తెలుగు రాష్ట్రాల్లో తొలి ఆస్పత్రిగా, దేశంలోనే మూడో ఆస్పత్రిగా ఏఐజీ నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా, ప్రోటాన్‌ థెరపీ విధానంలో క్యాన్సర్‌ కణితిని కచ్చితంగా గుర్తించి దానికి మాత్రమే చికిత్స చేయడం సాధ్యమవుతుందని డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ విధానంలో కణితి చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉన్న ఇతర అవయవాలకు ఎటువంటి నష్టం జరగదని, ఫలితంగా రోగి చాలా త్వరగా కోలుకుంటారని ఆయన వివరించారు. క్యాన్సర్‌ బారిన పడిన చిన్నారులు, వృద్ధులకు ఈ చికిత్స విధానం ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.

Updated Date - Jan 12 , 2025 | 05:50 AM