AV Ranganath: ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:58 AM
ఖాజాగూడ(Khajaguda)లోని భగీరథమ్మ, తౌటోనికుంటల వద్ద ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులూ మండిపడుతున్నారు.
- సామాజిక మాధ్యమాల్లో పలువురి అభిప్రాయాలు వైరల్
- మద్యం దుకాణం ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్న ఖాజాగూడ వాసులు
- చట్ట ప్రకారమే కూల్చివేతలు : హైడ్రా
హైదరాబాద్ సిటీ: ఖాజాగూడ(Khajaguda)లోని భగీరథమ్మ, తౌటోనికుంటల వద్ద ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులూ మండిపడుతున్నారు. అక్కడి నిర్మాణాల తొలగింపులో అధికారులు వివక్ష చూపారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానికుల అభిప్రాయాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రెండు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల యజమానులకు 24 గంటల్లో ఖాళీ చేయాలని, ఆక్రమణలను తొలగించాలని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హైడ్రా నోటీసులిచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి: ద్విచక్ర వాహనాలే దొంగల టార్గెట్
నిర్ణీత సమయం ముగియక ముందే మంగళవారం ఉదయం కూల్చివేతలు చేపట్టింది. అదే సమయంలో ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌లో ఉందంటూ నోటీసులిచ్చిన మద్యం దుకాణం జోలికి మాత్రం వెళ్లలేదు. నిరుపేదల నివాసాలను 24 గంటల గడువు ముగియక ముందే కూల్చిన హైడ్రా.. వైన్ షాపు(Wine shop)ను ఎందుకు తొలగించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదల గూళ్లను కూల్చి రోడ్డున పడేసి..
వ్యాపారుల విషయంలో మానవత్వం చూపారా..? అని మండిపడుతున్నారు. దీనిపై హైడ్రా వర్గాలు స్పందిస్తూ.. ‘ఎక్సైజ్, ఇతర శాఖల అనుమతిలో మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. తమంతట తాము తొలగిస్తాం.. కొంత సమయమివ్వాలని యజమానులు కోరారు. ప్రభుత్వ విభాగాల అనుమతి ఉన్నందున గడువిచ్చాం. ఇతర ఆక్రమణలకు సంబంధించి స్వచ్ఛందంగా తొలగిస్తాం.. సమయం కావాలన్న విజ్ఞప్తి రాలేదు’ అని పేర్కొన్నాయి.
చట్టం, న్యాయస్థానాలపై గౌరవముంది
ఖాజాగూడ కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టతనిచ్చారు. ఎనిమిదేళ్ల క్రితమే భగీరథమ్మ చెరువు, తౌటోనికుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణకు సంబంధించి తుది నోటిఫికేషన్ ప్రకటించారని, దానిని ప్రామాణికంగా తీసుకునే ఆక్రమణలు తొలగించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలతో తమ ఇళ్లలోకి వరద నీరు వస్తుందన్న స్థానికుల ఫిర్యాదుతో రెండు పర్యాయాలు ఆ చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని,
గత ఏడాది డిసెంబరు 28వ తేదీన దుకాణాల యజమానులు, రియల్టర్లతో బుద్ధభవన్‌లో సమావేశం నిర్వహించామన్నారు. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల వివరాలను గూగుల్ ఎర్త్ ద్వారా స్పష్టంగా వారికి చూపించామని, నిర్మాణ రంగ వ్యర్థాలు పోసి శిఖం పట్టా యజమానులు దుకాణాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులకు వారి నుంచి స్పందన లేకపోవడంతోనే తొలగించామన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్ 405 ప్రకారం చెరువులు, కుంటల్లో ఉన్న ఆక్రమణల తొలగింపునకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని,
నవంబరు 2024లో సుప్రీంకోర్టు కూడా జల వనరుల్లో ఆక్రమణలను నోటీసులు ఇవ్వకుండా తొలగించవచ్చని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. శిఖం పట్టా యజమానుల నుంచి ఏడెకరాలు కొనుగోలు చేసిన ఓ నిర్మాణ సంస్థ పట్టాదారులు, ఆక్రమణదారుల పేరిట కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా బుద్ధభవన్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారన్నారు. ఆక్రమణదారులు, మరి కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలు, చట్టం పట్ల హైడ్రా గౌరవంగా వ్యవహరిస్తుందని, చిత్తశుద్ధితో చట్టం ప్రకారం నడుచుకుంటామని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News