Bandi Sanjay: రైతు భరోసా.. బోగస్
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:33 AM
రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల పేరిట మరో సారి మోసగించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
స్థానిక ఎన్నికల తర్వాత ఇదీ ఇవ్వరు
రాష్ట్రంలో 14 శాతం కమీషన్ ప్రభుత్వం
ఇద్దరు, ముగ్గురు మంత్రులకైతే అదే పని
మోసాల్లో కాంగ్రె్‌సకు గురువు కేసీఆరే
కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల పేరిట మరో సారి మోసగించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆరే గురువు అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే కాంగ్రెస్ సర్కారులో కొనసాగుతున్నరని, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఎలా మోసం చేసిందో... ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని దుయ్యబట్టారు. టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి రూ.10వేల కోట్లు అప్పు తెచ్చారని, ఆ నిధులనే ప్రస్తుతం రైతు భరోసాకు వినియోగిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు రూ.15వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.12వేలు అంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అది కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు.
రైతు భరోసాను బోగ్‌సగా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌దేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా రూ.10వేల కోట్లు అప్పు తెస్తోందని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకను చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 14శాతం కమీషన్ సర్కార్ నడుస్తోందని, ఇద్దరు-ముగ్గురు మంత్రులకైతే అదే పనిగా మారిందని ధ్వజమెత్తారు. ఏడాది వ్యవధిలో ఏ గ్రామ పంచాయతీకి ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, కాంగ్రె్‌సకు దమ్ముంటే ఇదే అంశం అజెండాగా పంచాయతీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. కేసీఆర్ అంటేనే విశ్వాసఘాతకుడని సంజయ్ మండిపడ్డారు. ఫాంహౌజ్‌లో ఉండేవారికి, ప్రజల సమస్యలు పట్టించుకోనివారికి విపక్షనేత హోదా ఎందుకు? ఆ పదవి హరీశ్‌కో, బీసీ నేతలైన గంగుల, తలసానికో లేదా మరో నేతకో ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు.
జైపాల్‌రెడ్డి పేరును వ్యతిరేకిస్తున్నాం
రైతు భరోసా కింద 12వేలే ఇస్తామని ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అరుణ ప్రకటించారు. ఆ ప్రాజెక్టులో జైపాల్‌రెడ్డి పాత్ర ఏముందని ఆయన పేరు పెడుతున్నారని నిలదీశారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి పోరాటాలు చేశారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కోతల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.